వక్భ్ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందడంతో దేశంలో ఎక్కడా పెద్దగా వ్యతిరేకత రాలేదు కానీ బెంగాల్లో మాత్రం నిరసన ప్రదర్శనలు పెరుగుతున్నాయి. వక్ఫ్ బోర్డుల స్వయం ప్రతిపత్తిని, మత స్వేచ్ఛను హరిస్తాయని ఆరోపిస్తూ నిరసనలు ప్రారంభించారు. ముర్షిదాబాద్ జిల్లాలో ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. జంగీపూర్, ధూలియాన్ ప్రాంతాల్లో నిరసనకారులు రైల్వే స్టేషన్లు, వాహనాలపై దాడులు చేస్తున్నారు. ముగ్గురు చనిపోయారు. సీఎం మమతా బెనర్జీ ఈ బిల్లును బెంగాల్లో అమలు చేయబోమని, మతపరమైన విభజన రాజకీయాలను సహించబోమని ప్రకటించారు. ఇది ముస్లింల ఆందోళనలకు ఆజ్యం పోసినట్లయింది.
బెంగాల్లో 30 శాతం మంది ముస్లింలు – తృణమూల్ ఓటు బ్యాంక్
బెంగాల్లో ముస్లిం జనాభా గణనీయంగా ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, పశ్చిమ బెంగాల్లో ముస్లింలు మొత్తం జనాభాలో సుమారు 27 శాతం మంది ఉన్నారు. తాజాగా లెక్కలు తీస్తే 30 శాతానికి చేరి ఉంటారని భావిస్తున్నారు. ముస్లింలు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్. కాంగ్రెస్ నేతగా రాజకీయాల్లో ఎదిగిన మమతా బెనర్జీ సొంత పార్టీ పెట్టుకోవడంతో అంతా ఆమె వైపు వెళ్లారు. వారి మద్దతును కాపాడుకోవడానికి మమతా బెనర్జీ చేయగలిగినంతా చేస్తూంటారు. ఇప్పుడు వక్ఫ్ బిల్లు ఆమెకు మరో ఆయుధంగా దొరికింది. ఈ బిల్లును అమలు చేయబోమని చెప్పడం ద్వారా వారిని మరింత రెచ్చగొట్టారు. అల్లర్ల విషయంలో కట్టడి చేయడానికి కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
దేశంలో ఇతర ప్రాంతాల్లో వక్ఫ్ బిల్లుపై సానుకూలత
వక్ఫ్ బిల్లుపై చాలా పెద్ద చర్చ జరిగింది. ఇందులో ప్రతిపాదించిన అంశాల్లో కొన్నింటిపై కేంద్రం వెనక్కి తగ్గింది. వక్ఫ్ ఆస్తులను వక్ఫ్ బోర్జులే అన్యాక్రాంతం చేయడంతో ఈ చట్టంపై ముస్లిం వర్గాలు కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. వక్ఫ్ ఆస్తులను లాక్కునే ఉద్దేశమే లేదని ఆ ఆస్తులు పరాధీనం కాకుండా కాపాడటానికే బిల్లు తెచ్చామని కేంద్రం చెప్పింది. ఇదే విషయాన్ని దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ముస్లింలకు అర్థమయ్యేలా చెప్పగలిగారు. అందుకే పెద్దగా వ్యతిరేకత రాలేదు. ముస్లింలకు సంబంధం లేని అంశం కావడంతో ఇతరులు జోక్యం చేసుకోలేదు.
వ్యూహాత్మకంగానే బెంగాల్ నుంచి స్టార్ట్ చేశారా ?
వక్ఫ్ బిల్లు ఆమోదం పొంది.. రాష్ట్రపతి నోటిఫై చేసిన తర్వాతనే బెంగాల్లో నిరసనలు ప్రారంభమయ్యాయి. అంతా అయిపోయాక చేయగలిగేదేమీ ఉండదు. అయితే బెంగాల్ లో అనూహ్యంగా హింస కూడా జరగడం వెనుక రాజకీయ కుట్రలు ఉంటాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. ముస్లిం వర్గాలను రెచ్చగొట్టి దేశం మొత్తం ఆందోళనలు చేయించడానికి.. అదే సమయంలో తహవూర్ రాణాను తీసుకు వచ్చి శిక్ష వేసేందుకు ప్రక్రియ ప్రారభించడంతో ..ఆ కోణం కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెంగాల్ లో నిరసనలు ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తే మాత్రం ఖచ్చితంగా కుట్ర ఉందని అనుకోవచ్చు.