రాష్ట్ర విభజన కారణంగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడు నుంచి కూడా ఏపి ప్రభుత్వానికి సమస్యలు ఎదురవుతున్నాయి. దానికి ఎర్రచందనం స్మగ్లర్లు కారణం కావడమే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. శేషాచలం అడవులలో తమిళనాడుకి చెందిన కూలీలు ఎర్రచందనం చెట్లని నరుకుతూ పట్టుబడుతున్న వార్తలు తరచూ వస్తూనే ఉన్నాయి. శేషాచలం అడవులలో చాలా ఏళ్ల బట్టి ఎర్రచందనం స్మగిలింగ్ జరుగుతున్నప్పటికీ, రాష్ట్రంలో తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నుంచే దానిని అరికట్టేందుకు గట్టి ప్రయత్నాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. కనుకనే ఈ ఎర్రచందనం స్మగిలింగ్ వార్తలు మీడియాలో కనిపిస్తున్నాయి. దానిని అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా ఎర్రచందనం స్మగిలింగ్ కార్యకలాపాలు నిరంతరంగా కొనసాగుతూనే ఉన్నాయని మీడియాలో వస్తున్న వార్తలే నిరూపిస్తున్నాయి.
తమిళనాడు నుంచి వచ్చే కూలీలే ఈ పనులకి పాల్పడుతున్నట్లు చాలాసార్లు రుజువయింది. మళ్ళీ ఈ నెల 4వ తేదీన 32మంది కూలీలని పోలీసులు అరెస్ట్ చేయడంతో అది మరోమారు రుజువయింది. కానీ తమిళనాడులో రాజకీయ పార్టీలు దీనికి ఊహించని ట్విస్ట్ ఇచ్చాయి. వాళ్ళు అందరూ తిరుమల దర్శనానికి వెళుతున్న భక్తులని వారిని ఏపి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నాయి. తమిళర్ మున్నేట్రపడై అనే రాజకీయ పార్టీ కార్యకర్తలు కొందరు చెన్నైలోని కోయంబేడు బస్ స్టేషన్ వద్ద ధర్నా చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మని దగ్ధం చేశారు. ఏపి పోలీసులు అరెస్ట్ చేసిన ఆ 32మంది కూలీలని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కోయంబేడు బస్ స్టేషన్ నుంచి బయలుదేరుతున్న ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. బస్సులని కూడా వాళ్ళు అడ్డుకొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలారు నదిపై చెక్ డ్యాములు కట్టి తమిళనాడు రైతులకి అన్యాయం చేస్తోందని ఈ ధర్నా నిర్వహించిన అ పార్టీ అధ్యక్షురాలు వీరలక్ష్మి ఆరోపించారు.
ఎర్రచందనం స్మగిలింగ్ అరికట్టడానికి ఏపి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలని ఎవరూ తప్పు పట్టలేరు. కానీ ఈ సమస్యని తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడి శాశ్విత పరిష్కారం కోసం ప్రయత్నించకుండా, ఎర్రచందనం చెట్లని నరకడానికి వస్తున్న తమిళనాడు కూలీలని అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం వలననే ఈ సమస్య క్రమంగా జటిలం అవుతోంది. తమిళనాడులోనే కాదు..దేశంలో ఏ రాష్ట్రంలోనయినా ఇటువంటి అవకాశాలు వస్తే ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు వాటిని వదులుకోవు. తమిళనాడులో కూడా ప్రస్తుతం అదే జరుగుతోందని చెప్పవచ్చు. కనుక తమిళనాడుతో సమస్యలు ఇంకా పెరగకూడదనుకొంటే ఏపి ప్రభుత్వం తక్షణమే ఈ సమస్య గురించి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఒక పరిష్కారం కనుగొనడం చాలా మంచిది.