ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం- వైఎస్సార్ కాంగ్రెస్‌ల మధ్య సవాళ్ల రాజకీయాలు ముదిరి పాకాన పడుతున్నాయి. అటు వైఎస్ జగన్మోహనరెడ్డి, ఇటు నారా లోకేష్‌లు ఒకరికి ఒకరు సవాళ్లు విసురుకున్న నేపథ్యంలో ఆ సవాళ్లను స్వీకరించడానికి మాత్రం.. వారి తరఫున అనుంగు అనుచరులు తెరమీదకు వస్తున్నారు. లోకేష్ అవినీతి గురించి జగన్ ఆరోపణలు చేయడం వాటిని గురించి చర్చించడానికి దమ్ముంటే రావాలని లోకేష్ సవాలు విసరడం అందరికీ తెలిసిందే. అయితే ఆ సవాళ్ల పర్వాన్ని కొనసాగించే బాధ్యతను జగన్ తరఫున ఆయన పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, నారా లోకేష్ తరఫున ఎమ్మెల్యే బోండా ఉమా తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.
జగన్‌కు దమ్ముంటే తన మీద చేసిన ఆరోపణలపై చర్చకు రావాలని లోకేష్ బహిరంగ సవాలు విసిరారు. అయితే దీనికి స్పందనగా అంబటి రాంబాబు తెరపైకి వచ్చారు.శనివారం సాయంత్రంలోగా లోకేష్ డేట్, టైం ప్రకటిస్తే ఆ సమయానికి చర్చకు రావడానికి తాను సిద్ధం అని తేల్చేశారు. లోకేష్‌తో చర్చకు జగన్ రావాల్సినంత స్థాయి లేదని, తాను లేదా పార్టీ కార్యకర్త వస్తారని.. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదిక అయినా పర్లేదని రాంబాబు సవాలు విసిరారు.
ఈ సవాలుకు సహజంగానే లోకేష్ స్పందించలేదు. అయితే ఎమ్మెల్యే బోండా ఉమా స్పందించారు. రాంబాబు సవాలును స్వీకరిస్తున్నాం అని ఆయన ప్రకటించారు. అవినీతిలేదని నిరూపణ అయితే వైకాపాను మూసేస్తారా అంటూ ఆయన మెలిక పెట్టారు. మధ్యలో ఈ పలాయనవాదం ఏమిటో అర్థం కావడం లేదు. అవినీతి ఉన్నదని తేలితే తెలుగుదేశాన్ని మూసేస్తారా? అనే డిమాండు ఇక్కడ రాలేదు కదా? అవినీతి లేదని తేలితే లోకేష్ సచ్ఛీలుడు అని జగన బృందం ఒప్పుకుంటుందా? అని అడిగితే సరిపోయే దానికి , వైకాపా మూసేస్తారా అంటూ పసలేని సవాళ్లు విసరడం బోండా ఉమాకే చెల్లింది. ఇది సవాలును స్వీకరించడం లాగా కనిపించడం లేదు. సవాలునుంచి భయపడి పలాయనం చిత్తగిస్తున్నట్లుగానే ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎమ్మెల్యే బోండా ఉమా కు నిజంగానే వైకాపా సవాలును స్వీకరించేంత తెగువ ఉంటే గనుక.. శనివారంసాయంత్రం లోగా డేట్ అండ్ టైం ప్రకటించాలి. రాంబాబుతో చర్చకు తాను కూర్చోవడానికి సిద్ధపడాలి. అంతే తప్ప.. వైకాపా మూసేస్తారా? జగన్ సన్యాసం తీసుకుంటాడా? లాంటి ఉపయోగం లేని మాటలతో టైం వేస్ట్ చేయడం.. కేవలం ఆయనకే పరువుతక్కువ అని విశ్లేషకులు భావిస్తున్నారు.