కేసీఆర్ సర్కారు రాష్ట్రంలో ఒక కొత్త, భారీ ఆరోగ్య పథకాన్ని అమల్లోకి తేవాలనే కసరత్తు ప్రారంభించింది. యూనివర్సల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ తీసుకు రాబోతోంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో అమల్లో ఉన్న వివిధ ఆరోగ్య పథకాలన్నీ ఈ స్కీమ్ కిందకి వచ్చేస్తాయి. తద్వారా నిధులన్నింటినీ సక్రమంగా వినియోగించొచ్చు అనేది సీఎం ఆలోచన. ఇప్పుడున్న పథకాల కోసం రూ. 2 వేల కోట్లు ఏడాదికి ఖర్చవుతున్నా, సరైన వైద్య సేవలు ప్రజలకు అందడం లేదు. అన్నీ ఒక పథకం కిందికి వచ్చేస్తే… ప్రజలకు సక్రమమైన వైద్యం అందించాలనేది కేసీఆర్ సర్కారు ఆలోచన. ఈ కొత్త పథకం ప్రతిపాదన కచ్చితంగా ప్రజలకు మేలు చేసే నిర్ణయమే అవుతుంది.
దీన్లో రాజకీయ కోణం చూసుకుంటే… తెలంగాణపై భాజపా ప్రత్యేక దృష్టి పెట్టింది. కేంద్ర పథకాలను ఇక్కడ సీఎం కేసీఆర్ ఎందుకు అమలు చేయడం లేదంటూ ఇప్పటికే భాజపా నేతలు ప్రశ్నలు మొదలుపెట్టారు. నిజానికి, ఈ లొల్లి ప్రారంభమైందనే ఆయుష్మాన్ భారత్ పథకంతో. ఈ కేంద్ర పథకాన్ని తెరాస సర్కారు తిరస్కరించింది. ఎందుకంటే, అంతకుమించిన మంచి పథకాలను తామే అమలు చేస్తున్నామనీ, కేంద్ర పథకం అమలు చేస్తే కేవలం 20 లక్షల మందికి మాత్రమే పనికొస్తుందనీ, రాష్ట్ర అవసరాలు వేరేగా ఉన్నాయనేది కేసీఆర్ సర్కారు వాదన. కేంద్ర పథకం ద్వారా కేవలం రూ. 300 కోట్లే ఇస్తుందీ, రాష్ట్రంలో ఇప్పటికే ఆరోగ్య పథకాల కోసం రూ. 1000 కోట్లు పైనే ఖర్చుపెడుతున్నామనేది కేసీఆర్ సర్కారు కారణంగా చెబుతోంది. అంతేకాదు, తాజా కేంద్ర బడ్జెట్ లో కూడా ఈ పథకం కింద రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదనీ అధికార పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు.
కేంద్ర పథకం ఎందుకు అమలు చేయరనేది భాజపా ప్రశ్న..? ఇప్పటికే తెలంగాణపై ఫోకస్ పెంచిన భాజపా… రాష్ట్రంలో కేంద్ర పథకాలు అమలు జరగడం లేదనే పాయింట్ ని హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గానీ, మురళీధర్ రావుగానీ, గతవారం వచ్చి వెళ్లిన జాతీయ అధ్యక్షుడు అమిత్ షాగానీ… ఇలా అందరూ ఇక్కడ కేంద్ర పథకాలు ఎందుకు అమలు కావు అనే అంశాన్నే పట్టుకున్నారు. ముందుగా, ఆయుష్మాన్ భారత్ పథకం మీద విమర్శలు చేస్తే… రాజకీయంగా కొంత లబ్ధి పొందాలనే వ్యూహంతో వారున్నారు. దాన్ని బలంగా తిప్పికొట్టాలంటే, దానికి మించిన స్థాయిలో ఇక్కడ ఆరోగ్యం మీద రాష్ట్రం శ్రద్ధపెడుతోందని కేసీఆర్ సర్కారు చెప్పుకునే అవకాశమూ ఇప్పుడు ఉంటుంది. రాజకీయ కోణం ఎలా ఉన్నా… ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే పని ఏ ప్రభుత్వం చేసినా మంచిదే. అయితే, రాష్ట్రంలో ఏ స్థాయి పథకాలు అమల్లో ఉన్నా… కేంద్రం నుంచి వచ్చేవి తిరస్కరించాల్సిన పనేముంది అనేదే ప్రశ్న..? కేంద్రం ఇచ్చేది కూడా అదనపు ప్రయోజనం అవుతుందనే కోణం నుంచి కేసీఆర్ సర్కారు చూడటం లేదనే అనిపిస్తోంది.