తెలంగాణలో టీడీపీ, తెరాస నేతలు రెండు పార్టీల వారిగా కాకుండా శత్రుదేశాల వాళ్లలో ప్రవర్తిస్తున్నారు. ఒకరిమీద ఒకరు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఎదురు పడితే ఏం జరుగుతుందో అనే స్థాయిలో ఇరు పార్టీల నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మంత్రికి, టీడీపీ ఎమ్మెల్యేకు మధ్య గురువారం జరిగిన గొడవ ఇందుకు తాజా ఉదాహరణ.
మహబూబ్ నగర్ జిల్లా కోస్గి మండలం బోగారం గ్రామంలో ఒక శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. మంత్రి జూపల్లి కృష్ణారావు, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇందులో పాల్గొన్నారు. రెండు పార్టీల కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రభుత్వ కార్యక్రమం అలాగే అధికారికంగా ముగిస్తే గొడవ ఉండేదికాదు. మధ్యలో రాజకీయ వివాదాలు రాజుకునే ప్రసంగం చేయడంతో సమస్య మొదలైంది.
మంత్రి జూపల్లి కృష్ణా రావు ఈ సభలో మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. చంద్రబాబు వల్లే పాలమూరుకు నీళ్లు రావడం లేదని విమర్శించారు. దీంతో
రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. ఇక్కడ చంద్రబాబు ప్రస్తావన దేనికని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం, దీని గురించే మాట్లాడాలన్నారు. తాను నిజాలు చెప్తున్నానని, అడ్డుకోవద్దని జూపల్లి వాదించారు. దీంతో ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. జూపల్లి చేతిలోంచి రేవంత్ రెడ్డి మైక్ లాక్కున్నారు.
దీంతో తెరాస కార్యకర్తలు ఒక్క ఉదుటున లేచారు. రేవంత్ రెడ్డిని విమర్శించారు. మంత్రికి మైకు ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో టీడీపీ కార్యకర్తలు కూడా గుమిగూడారు. తెరాస కార్యకర్తలకు కౌంటర్ ఇచ్చారు. అరుపులు కేకలతో ఆ ప్రదేశం దద్దరిల్లింది. ఇరుపార్టీల వారూ పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు.
టీడీపీ వారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని తెరాస కార్యకర్తలు విమర్శించారు. తెరాస పాలనలో అంతా అవినీతేనని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. ఇందులో ఎవరిది తప్పనేది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. ప్రభత్వానికి చెందిన అభివృద్ధి కార్యక్రమంలో రాజకీయ ప్రసంగం చేయడం సరికాదన్నది టీడీపీ వాదన. వాస్తావలు చెప్తుంటే అడ్డుకోవడం, మైకు గుంజుకోవడం పద్ధతి కాదనేది తెరాస వాదన.
మొత్తానికి పాలమూరు జిల్లాలో మరోసారి కారు. సైకిల్ పార్టీల వారి మధ్య పెద్ద ఎత్తునే గొడవ జరిగింది. అది మరీ హింసాత్మకంగా మారకపోవడం ఒక్కటే ఊరట.