ఒకే చోట ఉంటూ మాటల తూటాలు పేల్చుకునే స్వేచ్ఛ ఎక్కువగా ఉన్న పార్టీ కాంగ్రెస్. ఇప్పుడు తెలంగాణలో మళ్లీ అదే జరుగుతోంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డిపై నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విరుచుకుపడ్డారు. విశేషం ఏమిటంటే, వీరిద్దరు ఒకే జిల్లాకు చెందిన వారు.
కోమటిరెడ్డి తెరాసలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని ఇప్పటికే టాక్. మంత్రి హరీష్ రావును కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం వెనుక పార్టీ ఫిరాయింపు ఆకాంక్ష ఉందనే ప్రచారం జరుగుతోంది.
పొమ్మనలేక పొగబెట్టడం ఒక పద్ధతి. వెళ్లేటప్పుడు కొంత హడావుడి చేయడం మరో పద్ధతి. అందుకే కోమటిరెడ్డి కారు ఎక్కడానికి ముందు కాంగ్రెస్ లో తనకు గిట్టనివారిపై విమర్శలు చేస్తున్నారనేది కాంగ్రెస్ నేతల అభిప్రాయం. ఉతమ్ వల్ల పాలేరులో ఓడిపోయామనే ఆరోపణను కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. కోమటిరెడ్డి తీరును సీఎల్పీ నాయకుడు జానారెడ్డి ఖండించారు.
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఏమీ బాగాలేదు. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఓటమిపాలైంది. మళ్లీ పుంజుకుందామంటే తెరాస అవకాశం ఇవ్వడం లేదు. దెబ్బమీద దెబ్బ కొడుతూనే ఉంది. కోమటిరెడ్డి బ్రదర్స్ త్వరలోనే తెరాసలోకి జంప్ చేయడం ఖాయమన్నది నల్గొండ కాంగ్రెస్ లో గట్టిగా వినిపిస్తున్న మాట.
నల్గొండ కాంగ్రెస్ లో మరో పెద్ద నేత ఫిరాయిస్తారన్న టాక్ కూడా ఉంది. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా తెరాసలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. తెరాస ఆపరేషన్ ఆకర్ష జోరుకు స్పందన పెరుగుతున్నట్టు కనిపిస్తోంది.
రేపో మాపో గుత్తా కారెక్కుతారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. దీన్ని గుత్తా ఖండించనూ లేదు. సమర్థించనూ లేదు. రేపు ఏం జరుగుతుందో చూద్దామంటూ నర్మగర్భంగా జవాబిస్తున్నారు. అంటే గులాబీ కండువా కప్పుకోవడానికి రెడీ అయ్యారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
గ్రేటర్ హైదరాబాదుతోపాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో విజయానికి కొందరు కాంగ్రెస్ నేతలు కష్టపడ్డారు. మరికొందరు చోద్యం చూశారు. మనకెందుకు అన్నట్టు అంటీ ముట్టనట్టు వ్యవహరించారు. ఫలితాలు పార్టీకి వ్యతిరేకంగా రావడంతో, కష్టపడ్డ వారిపైనే విమర్శలు చేస్తున్నారు.
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వారు, అన్నివిధాలుగా లాభపడ్డవారు కష్టకాలంలో ఫిరాయింపులకు పాల్పడటంపై కేడర్ గుర్రుగా ఉండటం సహజం. కానీ కార్యకర్తల అభిప్రాయాన్ని పట్టించుకునేది ఎవరు? పార్టీ గెలిచినా ఓడినా జెండాను వీడకుండా విధేయులై ఉండేవారిని హైకమాండ్ కూడా పట్టించుకోదు. తెలంగాణలో పరిస్థితి చక్కదిద్దడానికి హైకమాండ్ పూర్తిగా దృష్టిపెట్టినట్టులేదు. ఒకప్పుడు పదవులు అనుభవించిన వారికి కాకుండా పార్టీకి విధేయులై జెండా మోసేవారికే కాంగ్రెస్ కమిటీల్లో ప్రాధాన్యం ఇస్తే నైతిక స్థయిర్యం పెరుగుతుంది.
అది స్వార్థ నాయకులకు చెంపపెట్టులా ఉంటుంది కదా అన్న ప్రశ్నకు జవాబు దొరకడం కష్టమే.