లక్ష్మీ పార్వతి కోణం నుంచి ఎన్ టీయార్ జీవిత చరిత్ర తీస్తానన్న రాం గోపాల్ వర్మ పై టిడిపి నేతల మాటల యుద్దం మొదలైంది. టిడిపి ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ కి రాం గోపాల్ వర్మ కి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ముందుగా రాం గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్ టీయార్ సినిమా తీస్తే రాం గోపాల్ వర్మ ని తెలుగు రాష్ట్రాల్లో తిరగనివ్వమని టిడిపి ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలకి ఈరోజు ఫేస్ బుక్ లో ఘాటుగా స్పందించాడు రాం గోపాల్ వర్మ. “అసలు ఈ బాబూ రజేంద్ర ప్రసాద్ ఎవడొ నాకు తెలీదు, తెలుగు రాష్ట్రాల్లో తిరగనివ్వను అనడానికి తెలంగాణ, ఎపి ఏమైనా ఆయన జాగీరా?” అంటూ విరుచుకుపడ్డారు వర్మ. అయితే బాబూ రాజేంద్ర ప్రసాద్ మాత్రం ” వర్మ ని తెలుగు ప్రజలు ఎప్పుడో తిరస్కరించారనీ, వర్మ కి దమ్ముంటే బెంజ్ సర్కిల్ కి వచ్చి మాట్లాడాలని, అలా మాట్లాడితే, ప్రజలే వర్మ కి దేహశుద్ది చేసి బుద్ది చెప్తారు” అని ఆయన అన్నారు.
వర్మ తీసిన అన్ని బయోపిక్ లు కూడా మొదలవడమే ఇలాంటి కాంట్రవర్సీలతోనూ, మాటల దాడితోనూ మొదలవడం మామూలయిపోయింది. అయినా అసలు లక్ష్మీస్ ఎన్ టీయార్ సినిమా నిజరూపం దాలుస్తుందా లేక వర్మ అనౌన్స్ చేసి మరిచిపోయిన వందలాది సినిమాల జాబితా – ఉదాహరణకి మెకన్నాస్ గోల్డ్ స్ఫూర్తి తో తీస్తానన్న “అమ్మ” సినిమా, “కమర్షియల్ బ్రేక్” పేరిట తీస్తానన్న యాడ్ ఫిలింస్ మీద సెటైర్ సినిమా, జయలలిత జీవిత చరిత్ర మీద సినిమా..ఇలాంటి జాబితా లోకి చేరుతుందా లేక నిజంగానే సినిమా పూర్తవుతుందా అనేవి ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలే!!!