నీళ్ల ప్రాజెక్టుపై నిప్పులు కురుస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించ తలపెట్టిన మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై అధికార, ప్రతిపక్షాల భిన్నమైన వైఖరి ప్రజలను అయోమయానికి గురిచేస్తోంది. నిర్వాసిత రైతులకు అద్భుతమైన పరిహారం ప్యాకేజీ ఇస్తామని ప్రభుత్వం చెప్తోంది. ప్రభుత్వం చెప్పిన ప్యాకేజీ రైతులకు నష్టం కలిగిస్తుందని కాంగ్రెస్, టీడీపీ నేతలు అభ్యంతరం చెప్తున్నారు. జేఏసీ కూడా విపక్షాల వాదననే సమర్థిస్తోంది.
చివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మెట్టు దిగారు. 2013 భూసేకరణ చట్టం, తమ ప్రభుత్వం తెచ్చిన 123 జీవోల్లో దేని ప్రకారం రైతులు పరిహారం కోరితే ఆ ప్రకారం ఇస్తామన్నారు. కేసీఆర్ ఈ ప్రకటన చేసినా విపక్షాల దాడి ఆగటం లేదు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏటిగడ్డ కిష్టాపూర్ లో రెండు రోజుల దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. కేసీఆర్ పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. దీంతో రేవంత్ పై పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు.
తాము ఇవ్వతలపెట్టిన ప్యాకేజీ అత్యద్భుతమని ప్రభుత్వం చెప్తోంది. అది అధ్వాన్నమని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. జేఏసీ చైర్మన్ కోదండరాం ఆ ప్రాంత రైతులను కలిసినప్పుడు వాళ్లు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. కొందరైతే కోదండరాం కాళ్లపై పడ్డారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
మరి సర్కారీ ప్యాకేజీ అద్భుతమైతే రైతులు ఇంతగా ఎందుకు ఆవేదన చెందుతున్నారు? రైతుల అనుమానాలను నివృత్తి చేయడానికి ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదు?
ప్రతిపక్షాలతో లేదా జేఏసీతో ముఖాముఖి చర్చకు ప్రభుత్వం ముందుకు వస్తే సమస్య సులభంగా పరిష్కారం అవుతుంది. ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఈ మేరకు చొరవ చూపి బహిరంగ చర్చకు సిద్ధపడితే విపక్షాలు కూడా ముందుకు రావాల్సి ఉంటుంది. కనీసం జేఏసీ చైర్మన్ చర్చకు వచ్చినా ఇరు పక్షాల వాదనల్లో వాస్తవం ఎంతో బయటపడుతుంది.
సమస్య వచ్చినప్పుడు వెంటనే పరిష్కారానికి ప్రయత్నించడం ప్రభుత్వ బాధ్యత. అలా కాకుండా దాన్ని సాగదీస్తూపోతే రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ ఈగోలకు చోటు లేదు. రైతుల ప్రయోజనాలే ముఖ్యం. ఈ విషయాన్ని గుర్తిస్తే అన్నదాతకు న్యాయం జరిగే అవకాశం ఉంది.