జగన్ రెడ్డి టిక్కెట్ కేటాయింపుల కసరత్తులో భాగంగా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ దగ్గర హడావుడి కనిపిస్తోంది. చాలా మంది నేతలు వస్తున్నారు. వస్తున్న వారిలో కొంత మందిని జగన్ రెడ్డి పిలుస్తున్నారు.. . మరికొంత మంది వారే వస్తున్నారు. వస్తున్న వారందిరకీ టిక్కెట్లు లేవని ప్రచారం జరుగుతోంది. టిక్కెట్లు ఉంటాయా లేవా అన్న సంగతి తర్వాత అని.. ముందు ఎన్నికలు నెల రోజులు ముందుగానే ముంచుకొస్తున్నందున ..పెండింగ్ లో ఉన్న బిల్లులు మంజూరు చేయాలని వారు సీఎంవోపై ఒత్తిడి తెస్తున్నారు.
సీఎం క్యాంప్ కార్యాలయానికి వస్తున్న ఎమ్మెల్యేల్లో 90 శాతం మంది బిల్లుల మంజూరు కోసమే టెన్షన్ పడుతున్నారు. డిసెంబర్ నెలాఖరు వచ్చింది. ఫిబ్రవరి మొదటి లేదా రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని చెబుతున్నారు. అంటే.. నికరంగా ఏ బిల్లులు అయినా జనవరిలో రిలీజ్ చేయించుకుంటే సరి లేకపోతే మొత్తం పెండింగ్ లో పడిపోతాయి. నియోజకవర్గ ద్వితీయ శ్రేణి నేతలకు చెందిన బిల్లులు రూ. వందల కోట్లలో పెండింగ్ లో ఉంటున్నాయి. తాము బినామీలుగా ఉండి చేసిన పనులకూ బిల్లులు రావడం లేదు. కనీసం ఆ బిల్లులు అయినా మంజూరు చేయాలని నేతలు పట్టుబడుతున్నారు.
జగన్ రెడ్డికి ఇష్టమైతే టిక్కెట్ ఇస్తారు లేకపోతే లేదు.. కానీ బిల్లులు మాత్రం ఇవ్వకపోతే ఆర్థికంగా చితికిపోతామనుకునేవారి ఆందోళన ఎక్కువగా ఉంది. గత ప్రభుత్వం బిల్లులను ఈ ప్రభుత్వం పక్కన పెట్టింది. టీడీపీ నేతలు కోర్టులకు వెళ్లి పోరాడాల్సి వచ్చింది. ప్రభుత్వం మారే అవకాశం కనిపిస్తూండటంతో… వచ్చే ప్రభుత్వం బిల్లులు ఇస్తుందన్న నమ్మకంతో వైసీపీ నేతలు లేరు. అందుకే ముందుగా బిల్లుల కోసమే వారు సీఎంవోపై ఒత్తిడి తెస్తున్నారు.