వంద రోజుల గొడవలు పోయాయి..
ఇప్పుడు వసూళ్ల లెక్కలే చికాకు పెడుతున్నాయి!
అవును.. తెలుగు సినిమా ఇప్పుడు రికార్డు వసూళ్ల వలలో చిక్కుకుంది. మా సినిమా ఇంత సాధించింది.. మాది ఇన్ని రికార్డులు బద్దలు కొట్టింది అంటూ – పోస్టర్లు వేసుకుంటూ, ఎవరి డబ్బా వాళ్లే కొట్టుకుంటున్నారు. ఇంకాస్త ముందుకు వెళ్లి `వాళ్లది ఫేక్ కలక్షన్లు.. మావే వర్జినల్` అంటూ బురద జల్లుకుంటున్నారు. ఫ్యాన్స్ మధ్య చిచ్చు రేగడానికి ప్రత్యక్షంగా,పరోక్షంగా కారణమవుతున్నారు. ఈ వసూళ్ల గోల చిత్రసీమకు అవసరమా?
ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలొస్తే.. అందులో రెండు సినిమాల మధ్య నువ్వా, నేనా అన్నంత పోటీ నడిచింది. విడుదలకు ముందు ఈ పోటీ ఒక ఎత్తయితే, విడుదలైన తరవాత మరో ఎత్తుగా మారింది. మాదే ఆల్ టైమ్ రికార్డు, మాదే నాన్ బాహుబలి రికార్డు అంటూ పోస్టర్లు దంచేస్తున్నారు. సంక్రాంతి విన్నర్ అంటూ ఒకరు, అసలు సిసలైన సంక్రాంతి విజేత అంటూ ఒకరు – ఎవరి కాలర్ వాళ్లే ఎగరేసుకుంటున్నారు. ఈ వసూళ్లు నిజమో, కాదో తెలీదు గానీ, ఫ్యాన్స్ మధ్య మాత్రం చిచ్చు రేపడానికి దోహదం చేస్తోంది. సోషల్ మీడియాలో అయితే.. ట్రోలింగ్ విపరీతంగా జరుగుతోంది. చెరో వంద కోట్ల షేర్ వేసుకుంటే, ఇంకో యాభై కోట్లు వేసుకోలేకపోయారా? మీ సొమ్మేం పోతుంది.. అంటూ ఎటకారపు కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. సినిమా విడుదలకు ముందే… ఆల్ టైమ్ రికార్డు, నాన్ బాహుబలి రికార్డు, బ్లాక్ బస్టర్ హిట్ అంటూ కొంతమంది పోస్టర్లు కూడా రెడీ చేసుకుంటున్నార్ట. అదో విచిత్రం.
అసలు షేర్కీ, గ్రాస్కీ తేడా తెలియని వాళ్లు చాలామంది ఉంటారు. సామాన్య జనానికి ఈ లెక్కలు అర్థం కావు. వీటి మధ్య చాలా అంకెల గారడీ ఉంటుంది. థియేటర్లన్నీ కొంతమంది చేతుల్లోనే ఉంటాయి. అలాంటప్పుడు వాళ్లు ఏం చెబితే అదే వేదం. ఎన్ని వసూళ్లు వచ్చాయి అన్నది వాళ్లే డిసైడ్ చేస్తారు. అందులో అసలెంతో, వాళ్లు కలిపే కొసరెంతో వాళ్లకే తెలియాలి. ఉదాహరణకు నైజాం థియేటర్లన్నీ దిల్ రాజు చేతుల్లో ఉంటాయి. ఆయన ఎంత ఫిగర్ ఫైనల్ చేస్తే దాన్నే పక్కా చేసుకోవాలి. అది నిజమా? కాదా? అనేది మిగిలినవాళ్లకు తెలీదు. గీతా ఆర్ట్స్ చేతిలో సగం థియేటర్లున్నాయి. బన్నీ సినిమా వచ్చినప్పుడల్లా.. వాళ్లు చెప్పిందే వేదం. అంటే ఎవరి చక్రం వాళ్లు తిప్పుపకుంటున్నారన్నమాట.
ఏ సినిమాకి ఎంతొచ్చింది? అని నిర్దారించే వ్యవస్థ టాలీవుడ్లో లేదు. టికెట్ల కొనుగోలు ఆన్లైన్ చేయనంత కాలం ఇలా రికార్డుల కోసం ప్రాకులాడడం మామూలే. ఇది వరకు వంద రోజుల సెంటర్ల కోసం ఇలానే కొట్టుకునే వారు.యాభై రోజుల తరవాత డ్రాప్ అయిపోయిన సినిమాని కూడా వంద రోజుల కోసం లాగేవారు. హీరోలు సైతం ఈ ఫాల్స్ ప్రెస్టేజీలో పడిపోవడం వల్ల.. ఆ సినిమా కొన్న బయ్యర్లు తీవ్రంగా నష్టపోయేవారు. కొన్ని సెంటర్లలో అభిమానులే సినిమాని ఆడించుకునేవారు. అలా.. వాళ్ల జేబులు గుల్ల అయ్యేవి. ఇప్పుడు ఆ యావ లేదు. సినిమాని ఎక్కువ సెంటర్లలో విడుదల చేసుకుని, మూడు రోజుల్లో పెట్టుబడి మొత్తం లాగేయాలని చూస్తున్నారు. మాదే పైచేయి అని చెప్పుకోవడానికి ఇలా నెంబర్ గేమ్ ఆడుతున్నారు.
నా పోస్టరుపై రికార్డు వసూళ్ల గురించి వివరాలేం ఉండకూడదు.. అని రామ్చరణ్ బలమైన నిర్ణయం తీసుకున్నాడు. రంగస్థలం విషయంలో ఇలాంటి అంకెల గారడీ కనిపించలేదు. మిగిలిన హీరోలు కూడా ఇలా ఆలోచిస్తే తప్ప, ఈ ఫేక్ రికార్డుల నుంచి విముక్తి లభించదు. లేదంటే… వసూళ్ల లెక్కల్ని పక్కగా రికార్డు చేసేలా ఓ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. ఫిల్మ్ ఛాంబర్లో అందుకో విభాగం ఉండాలి. నిస్పక్షపాతంగా, ఎవరి అజమాయిషీకి, ఆధిపత్యానికీ లొంగకుండా, స్వతంత్య్రంగా నిర్ణయాలు తీసుకోవాలి. ‘మాకెందుకీ రికార్డు మాతో సినిమాలు తీసిన నిర్మాతలు, సినిమా చూసిన ప్రేక్షకుడు సంతోషంగా ఉంటే చాలు’ అని హీరోలంతా ఫిక్సయితే.. ఇక ఎలాంటి గోలా ఉండదు. ఆ రోజు వస్తుందంటారా??