పదవులు పోతాయ్ అన్న అధినేత జగన్ వార్నింగ్ ను సీరియస్గా తీసుకున్న కొంత మంది నేతల నియోజకవర్గాల్లో రచ్చ జరిగింది కానీ… ఇతర చోట్ల మాత్రం.. నామినేషన్లు ప్రశాంతంగా ముగిశాయి. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూల్ జిల్లాల్లో ఏకగ్రీవాలకు పలువురు నేతలు అన్నిరకాల ప్రయత్నాలు చేశారు. బలాన్ని బట్టి.. నామినేషన్ల తిరస్కరణ వ్యూహం నుంచి.. ఉపసంహరించుకోవడం వరకూ అన్నీ చేశారు. మాచర్ల, గురజాల, పులివెందుల, పీలేరు, చంద్రగిరి, పుంగనూరు నియోజకవర్గాల్లో పరిస్థితి అదుపు తప్పింది. టీడీపీ నేతలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నప్పటికీ.. ఎక్కువగానే నామినేషన్లు వేసారు. టీడీపీ మొత్తంగా ఎంపీటీసీ స్థానాలకు 9 వేల 117, జెడ్పీటీసీ స్థానాలకు 639, నగర పంచాయతీలకు 302, కార్పొరేషన్లకు 557, పురపాలక సంఘాలకు 1630 నామినేషన్లు దాఖలు చేశారు. ఇది తొంభై శాతానిపైగానే ఉంది.
ప్రతిపక్ష నేతలపై దాడులకు పాల్పడిన అనేక చోట్ల… వైసీపీ బలంగానే ఉంది. ఎన్నికలు జరిగినా.. గెలిచే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ.. వైసీపీ నేతలు.. గెలుపుపై నమ్మకం లేదనుకున్నారో.. డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుందని భయపడ్డారో లేక.. అరాచకం సృష్టిస్తే..ఆ ప్రభావం… ఎన్నికలు జరుగుతున్న ఇతర ప్రాంతాలపై పడుతుందని అనుకున్నారో కానీ… మొత్తానికి దాడులు, దౌర్జన్యాలతో హోరెత్తించారు. ఓ రకమైన భయానక వాతావరణం కల్పించారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ టీడీపీ 90 శాతానికిపైగా స్థానాల్లో బరిలో ఉంది. దీన్నే టీడీపీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు. పోలీసులను సైతం ప్రయోగించి.. దొంగ కేసులు పెట్టే ప్రయత్నం చేసినా.. తమ క్యాడర్ తొడకొట్టిందని… ఇలాంటి పార్టీని ఏమీ చేయలేరని అంటున్నారు.
గ్రామాల్లో.. గతంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ కు ప్రభుత్వం అనేక రకాల పనులు ఇచ్చింది. ఉపాధి హామీ పనులు అందులో ముఖ్యమైనవి. వాటికి సంబంధించిన బిల్లులు ప్రభుత్వం విడుదల చేయలేదు. ఇలా బిల్లులు రావాల్సిన వారితో నామినేషన్లు ఉపసంహరించుకోవడంలో సక్సెస్ అయ్యారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ పోటీ విషయంలో.. తాము భయపడలేదని… ప్రజలు స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకుంటే… ప్రభుత్వానికి షాక్ తప్పదని అంటున్నాయి.