వరంగల్ ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొచ్చి ఎయిర్ పోర్టు తరహాలో నిర్మిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఎయిర్ పోర్టు తీసుకు వచ్చిన క్రెడిట్ మాదంటే మాదని అన్ని పార్టీలు క్రెడిట్ గేమ్ ప్రారంభించాయి.
కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడిన తరవాత రోజు మామనూరు ఎయిర్ స్ట్రిప్ వద్ద బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు హడావుడి చేశారు. మా వల్లే అని .. రెండు పార్టీల కార్యకర్తలు సంబరాలు చేసుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ క్రెడిట్ గేమ్ కార్యకర్తల నుంచి నేతలకు పాకింది. తాను ఎంతో కష్టపడి కేంద్రమంత్రులకు చుట్టూ తిరిగి.. భూసేకరణకు నిధులు ఇచ్చి మరీ ఎయిర్ పోర్టు తీసుకు వచ్చానని రేవంత్ అంటున్నారు. అయితే అది కిషన్ రెడ్డి ఘనత అని బీజేపీ ప్రచారం చేసుకుంటోంది. అయితే ఏదైనా వస్తే కిషన్ రెడ్డి ఘనత లేకపోతే నా తప్పా అని రేవంత్ మండి పడుతున్నారు.
అసలు వీరిద్దరూ కాదు.. తాము అసలు ఎయిర్ పోర్టు అంశాన్ని తెరపైకి తెచ్చామని ఇప్పుడు అనుమతులు మంజూరు చేయక తప్పలేదని బీఆర్ఎస్ అంటోంది. అయితే గతంలో నే కేంద్రం ఎయిర్ పోర్టు నిర్మించాలనుకున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణకు సహకరించలేదని రామ్మోహన్ ప్రకటించడంతో ఆ పార్టీ గాలి తీసేసినట్లయింది. వరంగల్ ఎయిర్ పోర్టు నిర్మాణం వరంగల్ వాసుల చిరకాల స్వప్నం. ఇప్పటికి సాకారం అయ్యే దశకు వచ్చింది. ఈ క్రెడిట్ గేమ్ పక్కన పెట్టి ముందుగా.. చేయాల్సిన పనులు పూర్తి చేయించాలని ప్రజలు కోరుకుంటున్నారు.