విమానాశ్రయాల విషయంలో తెలంగాణ వెనకబడి ఉంది. హైదరాబాద్ మినహా రాష్ట్రంలో మరెక్కడా ఎయిర్ పోర్టు లేదు. నిజానికి రెండో పెద్ద నగరమైన వరంగల్ లో స్వాతంత్య్రానికి పూర్వమే విమానాశ్రయం ఉంది. మామునూరు వద్ద చివరి నిజా మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1930లోనే అతిపెద్ద విమానాశ్రయం నిర్మించారు. దాదాపు 700 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 6 కిలోమీటర్ల అతిపెద్ద రన్వే తో భారత్లోనే అతిపెద్ద విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఉత్తర తెలంగాణలోని వివిధ వ్యాపారాల అభివృద్ధికి రాకపోకల కోసం ఈ విమానాశ్రయాన్ని వినియోగించుకునే వారు. ప్రముఖుల పర్యటనల రాకపోకలతో 1980 వరకు విమానాశ్రయం అందుబాటులో ఉంది. కానీ ఆ తర్వాత కార్యకలాపాలు ఆగిపోయాయి.
కార్గిల్ యుద్ధ సమయంలోనూ శత్రువులు ఏదైనా విమానాశ్రయాన్ని టార్గెట్ చేస్తే అత్యవసరంగా వాడుకునేందుకు వరంగల్ ఎయిర్ పోర్టును సిద్ధం చేసి ఉంచారు. 6.6 కి.మీ రన్ వే, పైలట్, సిబ్బంది గృహాలు, పైలట్ శిక్షణా కేంద్రం, ఒకటి కన్నా ఎక్కువ టెర్మినల్స్ తో 700 ఎకరాలకు పైగా భూమి కలిగిన ఉన్న ఈ విమానాశ్రయం ప్రస్తుతానికి నిరూపయోగంగా పడి ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. మూడు విమానాశ్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. అందులో వరంగల్ విమానాశ్రం ఒకటి. కానీ మళ్లీ ఎలాంటి పురోగతి లేదు.
దశాబ్దాలుగా నిరూపయోగంగా ఉండటంతో విమానాశ్రయానికి చెందిన కొంత భూమి కబ్జాకు గురైంది. ఈ విమానాశ్రయాన్ని మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలంటే మరికొంత భూమి అవసరం ఉంది. భూసేకరణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీకే కేబినెట్ హోదాలో విమానయాన మంత్రిత్వ శాఖ లభించింది. వరంగల్లో మౌలిక సదుపాయాలను పెంచాలని ప్రభుత్వం కూడా భావిస్తోంది కాబట్టి.. వేగంగా ఈ సారి వరంగల్ ఎయిర్ పోర్టు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.