తెలుగు రాష్ట్రాల్లో ద్వితీయ శ్రేణి నగరాలు వేగంగా ఎదుగుతున్నాయి.ఎంత మంది ప్రజలు నివసిస్తే అంత వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో తెలంగాణలో వరంగల్ ఏపీలోని గుంటూరు నగరాలు అతి త్వరలోనే పది లక్షలకుపైగా జనాభా నివసిస్తున్న నగరాల జాబితాలో చేరనున్నాయి .ఈ ఏడాది చివరి కల్లా మిలియన్ ప్లస్ సిటీల జాబితాలోకి ఈ రెండు నగరాలు చేరుతారని ఎక్రాప్ అనే సంస్థ నివేదికలో వెల్లడించింది.
తెలంగాణలో హైదరాబాద్ తప్ప.. పది లక్షల జనాభా ఉన్న నగరాలు లేవు. వరంగల్ మాత్రమే వేగంగా వృద్ధి చెందుతోంది. హైదరాబాద్కు కాస్త చేరువుగా ఉండటంతో భౌగోళికంగా.. పారిశ్రామికంగా కూడా ముందడుగు వేస్తూండటంతో వరంగల్ కు ఉపాధి కోసం వచ్చి స్థిరపడిపోయేవారి సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్కు కనెక్టివిటీ కూడా మెరుగుపడుతోంది. అందుకే వరంగల్ మరో హైదరాబాద్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు. ఇక ఏపీలో హైదరాబాద్ స్థాయి సిటీ లేదు. కానీ పది లక్షలకుపైగా జనం ఉన్న సిటీలుగా విశాఖ, విజయవాడ ఉన్నాయి. ఇప్పుడు మూడో సిటీగా గుంటూరు మారనుంది. అమరావతి పూర్తి స్థాయిలో అభివృద్ది జరిగితే భవిష్యత్ ఈ రెండు సిటీలు కలిసి పోతే హైదరాబాద్ కన్నా పెద్ద నగరం అయ్యే అవకాశం ఉంటుంది.
పల్లెల నుంచి ప్రజలు వలస వస్తున్నారు. ఇప్పుడు ఓ మోస్తరు పట్టణాల నుంచి మెట్రోలకు వలస వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. ఉపాధి అవకాశలు ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడకు జనం వెళ్లడం కామనే. ఆ ప్రకారం చూసుకుంటే వరంగల్, గుంటూరు నగరాలు ఉపాధి కేంద్రాలుగా మారుతున్నాయని అనుకోవచ్చు. ప్రభుత్వాలు ఈ నగరాల మీద మరింత ఎక్కువ దృష్టి పెడితే అభివృద్ధి కూడా ఎక్కువగానే జరిగే అవకాశం ఉంది.