హైదరాబాద్: వంద స్మార్ట్ సిటీల పథకంలో తొలిదశకు ఎంపిక చేసిన 20 నగరాల జాబితాను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు నిన్న ఢిల్లీలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏపీ నుంచి కాకినాడ, విశాఖపట్నం ఎంపిక అవగా తెలంగాణనుంచి ఒక్క నగరమూ ఎంపిక కాలేదు. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందిస్తూ, కాకినాడ, విశాఖపట్నం మాత్రమే మీకు కనిపించాయా, తెలంగాణను కాకెత్తుకెళ్ళిందా అంటూ కేంద్రప్రభుత్వంపై సెటైర్ కూడా వేశారు. ఈ ఎంపికలో రాజకీయాలేమీ లేవని వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. స్మార్ట్ సిటీ ఛాలెంజ్లో పాల్గొన్న నగరాలకు 100 పాయింట్ల పరీక్ష నిర్వహించామని, ఆ పాయింట్ల ఆధారంగానే ఎంపిక చేశామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడి సొంత నియోజకవర్గం వారణాసిలోని వారణాసి నగరం, తన సొంత నగరం నెల్లూరు కూడా ఈ పథకంలో ఎంపిక కాలేదని గుర్తు చేశారు. నిన్న విడుదల చేసిన జాబితాలోని 97 నగరాలలో కాశీ నగరం 96వ స్థానంలో ఉండగా, నెల్లూరు నగరం అసలు 100 నగరాలలో కూడా లేదని చెప్పారు. తాము కేవలం ఎంపికకు మార్గదర్శకాలను, ప్రమాణాలను మాత్రమే రూపొందించామని తెలిపారు. రాజకీయ జోక్యమేమీ లేదని, మెరిట్ ప్రాతిపదికనే ఎంపిక జరిగిందని అన్నారు. వరల్డ్ బ్యాంక్, జర్మనీ డెవలప్మెంట్ బ్యాంక్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్ సంస్థలతో మూడు ప్యానెల్స్ ఏర్పాటు చేశామని, ఎంపికను అవే నిర్వహించాయని తెలిపారు.