హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ ఉపఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా తన అభ్యర్థిని రంగంలోకి దించింది. నల్లా సూర్యప్రకాష్‌ను తమ అభ్యర్థిగా వైసీపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ ప్రకటించారు. ఇవాళ హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతోనే ప్రచారం చేపడతామని చెప్పారు. నల్లాను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వరంగల్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కొంతమంది వైసీపీపై విమర్శలు చేస్తున్నారని, వారి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని పొంగులేటి అన్నారు. నాడు వైఎస్ బడుగు, బలహీనవర్గాలకు, దళితులకు, మహిళలకు జరిపిన సంక్షేమ కార్యక్రమాలే ఈ ఎన్నికలలో తమను గెలిపిస్తాయని చెప్పారు. నల్లాకూ బీ ఫామ్ అందజేశారు. నల్లా మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలు మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. షర్మిల కాళ్ళకు బలపాలు కట్టుకుని ఓదార్పు యాత్ర పేరుతో తిరగటమేగానీ వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు తెలంగాణలో పెద్ద బలమేమీ లేదన్న సంగతి తెలిసిందే. గెలిచిన కొద్దిమంది ఎమ్మెల్యేలుకూడా టీఆర్ఎస్లోకి జంప్ అయ్యారు. అయినా ఈ ఎన్నికలలో పోటీని నిలబెట్టటంవలన కాంగ్రెస్ ఓట్లను చీల్చటం తప్ప వైసీపీ సాధించేదేమిటో అర్థంకాకుండా ఉంది.