తెలంగాణలో రాజకీయంగా అత్యంత కీలకమైనది.. ఉమ్మడి వరంగల్ జిల్లా. అభ్యర్థుల ప్రకటన, ప్రచారం విషయంలో టీఆర్ఎస్ చాలా దూకుడుగా వెళ్తోంది. ప్రతిపక్షాలు మాత్రం తమ అభ్యర్థులను ప్రకటించలేదు. పొత్తుల కసరత్తులోనే మునిగి తేలుతున్నాయి. మహాకూటమి పొత్తు ప్రభావం కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా పడుతోంది. టీడీపీ, టీజేఎస్, సీపీఐకి ఎన్ని సీట్లు ఇస్తారు? ఏ స్థానాలు కేటాయిస్తారనే అంశాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. తమకు పక్కాగా సీట్లొస్తాయనుకున్న ఒకరిద్దరే ప్రజల్లో తిరుగుతున్నారు. మిగిలిన వారు అటు ప్రచారం చేయలేక.. ఇటు కార్యకర్తలకు సమాధానాలు చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి టీడీపీ, టీజేఎస్, సీపీఐ తాము ఆశిస్తున్న సీట్ల వివరాలను పీసీసీకి అందించాయి. మూడు పార్టీలు నాలుగు స్థానాలు వరంగల్ జిల్లా నుంచి ఆశిస్తున్నాయి.
కాంగ్రెస్ 10 చోట్ల పోటీ చేయాలని భావిస్తోంది. సర్వేల్లో తమకు అనుకూలమైన వాతావరణం ఉందని అందుకే ఎక్కువ సీట్లు అడుగుతున్నామని నేతలు చెబుతున్నారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డికి నర్సంపేట నుంచి బరిలోకి దిగాలని ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సీటు ఆశిస్తున్నారు. పరకాల సీటు రేవూరికి ఇద్దామంటే కొండా దంపతులు ఇటీవల సొంత గూటికి చేరారు. తాను ఈ స్థానం నుంచే పోటీ చేస్తానని సురేఖ బహిరంగంగానే ప్రకటించారు. ప్రచారం కూడా ప్రారంభించారు. ఆమె తన కుటుంబానికి మరో టిక్కెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆశావహులు చాలా మందే ఉన్నారు. వీరందర్నీ సర్దుబాటు చేయడానికి తంటాలు పడుతున్నారు. మహాకూటమి పొత్తులతో పాటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్న కాంగ్రెస్ తమ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు రూపొందించుకుంటోంది పార్టీలో గెలుపు గుర్రాల కోసం వడపోత చేపట్టనుంది. టీ పీసీసీ ఎన్నికల కమిటీ ఇచ్చిన 1:3 జాబితాను వడపోసిన అనంతరం 15వ తేదీలోపు ప్రతి నియోజకవర్గానికి ఒకరు లేదా ఇద్దరి పేర్లతో ఏకే ఆంటోనీ నేతృత్వంలోని జాతీయ ఎన్నికల కమిటీకి జాబితా ఇవ్వనుంది.
అక్కడ తుది నిర్ణయం తీసుకుని 15వ తేదీ నుంచి 20వ తేదీలోపు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించనున్నారు. ముందుగా.. మిత్రపక్షాలకు ఏఏ సీట్లు కేటాయిస్తారనేది క్లారిటీ వచ్చిన తర్వతా.. వరంగల్ రాజకీయాల్లో అసలు రచ్చ ప్రారంభమయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. రెండు, మూడు రోజుల్లో వరంగల్ …పాలిటిక్స్‌లో వేడి పెరిగే అవకాశం కనిపిస్తోంది.