వరంగల్ (ఎస్.సి.) లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో సునాయాసంగా గెలుస్తామనుకున్న కేసీఆర్ లెక్క తప్పింది. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న తీవ్ర ఆగ్రహం బయటపడుతోంది. ఏకంగా మంత్రి కడియం శ్రీహరి మీదే ఓ రైతు చెప్పు విసిరాడంటే అన్నదాత కడుపు మంట ఏమిటో అర్థమవుతుంది.
వరంగల్ లోని వాస్తవ పరిస్థితులను గమనిస్తే, ఈ లోక్ సభ నియోకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో పాలకుర్తి, పరకాలలో మాత్రమే గత ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు విజయం సాధించారు. ఇక, స్టేషన్ ఘన్ పూర్, వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్న పేట, భూపాలపల్లిల్లో తెరాస విజయం సాధించింది. ప్రభుత్వం ఏర్పడిన 19 నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. దీన్ని క్యాష్ చేసుకునేది ఎవరనేది ప్రశ్న.
కాంగ్రెస్ పరిస్థితి అనూహ్యంగా మారిపోయింది. మాజీ ఎంపీ రాజయ్య, తన కోడలు, మనవళ్ల అనుమానాస్పద మృతితో అరెస్టయ్యారు. అనూహ్య పరిస్థితుల్లో సర్వే సత్యనారాయణ అభ్యర్థి అయ్యారు. ఆయన స్థానికుడు కాకపోయినా కాంగ్రెస్ కేడరే పెద్ద దిక్కుగా ప్రచారంచేస్తున్నారు. సర్వే స్థానికేతరుడనేదే తెరాస ప్రచారాస్త్రంగా ఉంది. ఇక, బీజేపీ ఒక ఎన్నారైని రంగంలోకి దింపింది. ప్రజలకు పరిచయం లేని ఆ అభ్యర్థిని కార్యకర్తలే జనంలోకి తీసుకు పోతున్నారు. ముఖ్యంగా తెలుగు దేశం బలం మీదే బీజేపీ ఆధారపడింది. బీజేపీకి చాలా చోట్ల సొంత కేడర్ లేదు. దీంతో టీడీపీ మద్దతును నమ్ముకుని బరిలోకి దిగింది.
ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పుడు, బలంగా ఉన్న ప్రతిపక్షానికి ప్రజలు ఓటు వేసి బుద్ధి చెప్పడం ఆనవాయితీ. ఇప్పుడు వరంగల్ లో అలా ఏ పార్టీకి ఓటు వేస్తారనేది ప్రశ్న. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులిద్దరూ ఎవరికీ తెలియదు. పార్టీ పరంగా ఓటు వేయాల్సిందే. పైగా ఈ రెండు పార్టీల మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతే అది తెరాసకు ప్లస్ పాయింట్ కావచ్చు.
నిజానికి, తెరాసకు ఎన్నో నెగెటివ్ పాయింట్లున్నాయి. వరంగల్ నగరంలో భారీగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. నాలుగు నెలల్లో కట్టిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చిన పక్కా ఇళ్లు అడ్రస్ లేవు. నగరంలోని సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన వాగ్దానాల జాడ లేదు. నగరంలోని ఎమ్మెల్యేల పనితీరుపైనా విమర్శలున్నాయి. చివరకు, కాళోజీ స్మారక భవన నిర్మాణం కూడా 19 నెలల్లో పూర్తి కానేలేదు. తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పాల్గొన్న వరంగల్ యువత, తెరాస ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉంది.
గ్రామాల్లో రైతులు కోపంగా ఉన్నారు. గిట్టుబాటు ధర లేకపోవడం, రుణమాఫీ సక్రమంగా అందక పోవడం, సకాలంలో రుణాలు లభించకపోవడం, పత్తి రైతులను ప్రభుత్వం గాలికి వదిలేయడం వంటి సమస్యలు అనేకం ఉన్నాయి. పత్తి రైతుల విషయంలో కేంద్రం మీద విమర్శలు చేయడం తప్ప, రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. బాహాటంగా దళారులు మార్కెట్లలో రైతులను దోచుకుంటున్నా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. చేతితో పత్తిని పట్టి చూసి ధరను నిర్ణయించే దౌర్భాగ్య స్థితిలో రైతుల కడుపు మండిపోతోంది. అయితే, ఈ రైతుల్లో కొందరు బీజేపీకి, కొందరు కాంగ్రెస్ కు ఓటు వస్తే తెరాస గెలుపును ఎవరూ ఆపలేరేమో. చివరకు ప్రజలంతా ఒక ప్రతిపక్షానికి ఓటు వేసి కేసీఆర్ కు షాకిస్తారా, లేక విపక్ష ఓట్ల చీలిక వల్ల తెరాస గట్టెక్కుతుందా అనేది చూడాలి.