వరంగల్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. క్రితంసారి 76.3 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి అది 67 శాతానికి తగ్గింది. ఉప ఎన్నిక అనగానే ఉత్సాహం తగ్గడం సహజం. కానీ, సుమారు 10 శాతం పోలింగ్ తగ్గడం అధికార పార్టీకి ఊరట కలిగించే విషయమని కొందరు పరిశీలకుల అంచనా. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా కనిపించిన సమయంలో పోలింగ్ శాతం తగ్గడం ప్రతిపక్షాలకు కొంత నిరాశ కలిగించింది. అయినా, 67 శాతం పోలింగ్ అంటే తక్కువేం కాదని, ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో తాము గెలుస్తామని కాంగ్రెస్, బీజేపీ లు అంచనా వేస్తున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదని, కాబట్టి కారు దూసుకుపోవడం ఖాయమని తెరాస నేతలు బల్లగుద్ది చెప్తున్నారు.
అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పోలింగ్ సరళిని గమనిస్తే అనేక ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు సొంత నియోజకవర్గం పాలకుర్తిలో అత్యధికంగా 76 శాతం పోలింగ్ నమోదైంది. టీడీపీ గెలిచిన మరో అసెంబ్లీ సెగ్మెంట్ పరకాలలో 69 శాతం పోలింగ్ నమోదైంది. ఇక, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి నియోజకవర్గం భూపాలపల్లిలో 70 శాతం పోలింగ్ నమోదైంది. పట్టణ ప్రాంత ఓటర్లు ఈ ఉప ఎన్నికపై పెద్దగా ఆసక్తి చూపలేదు. అందుకే, వరంగల్ వెస్ట్ సెగ్మెంట్ లో అతి తక్కువగా 48 శాతం, వరంగల్ ఈస్ట్ల్ లో 62 శాతం పోలింగ్ నమోదైంది.
వరంగల్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5 చోట్ల తెరాస ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఎంపీగా గెలిచిన కడియం శ్రీహరి రాష్ట్ర మంత్రివర్గంలో చేరడంతో రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అవసరమైంది. కడియం సొంత సెగ్మెంట్ స్టేషన్ ఘన్ పూర్ లో ఈ ఉప ఎన్నికలో 65 శాతం పోలింగ్ నమోదైంది.
పోలింగ్ సరళిని బట్టి ఫలితాన్ని అంచనా వేయడంలో పార్టీలు తలమునకలై ఉన్నాయి. గెలుపు తమదేనని తెరాస ధీమాగా చెప్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది కాబట్టి విజయం తమదే అంటూ అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు కూడా ధీమాగా చెప్తున్నాయి. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ భారీగా జరగడం తెరాసకు ఇబ్బంది అవుతుందా అనే చర్చ కూడా జరుగుతోంది. రైతులు, గ్రామీణ ప్రాంతాల్లోని యువత, మహిళలు ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. మరోవైపు, పట్టణ ప్రాంతాల్లోనూ కేసీఆర్ హామీలు పెద్దగా అమలు కాలేదు కాబట్టి అక్కడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ప్రజలు స్పందించారని ప్రతిపక్షాలు చెప్తున్నాయి.
తెరాస వాదన మరోలా ఉంది. కోత లేకుండా కరెంటు సరఫరా చేయడం, పెన్షన్ల మొత్తాన్ని వెయ్యి రూపాయలకు పెంచడం, జలహారం, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి చర్యలు, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని గులాబీ శ్రేణులు నమ్మకంగా ఉన్నాయి. ఇంతకీ ఎవరి అంచనాలు నిజమవుతాయనేది ఈనెల 24న జరిగే ఓట్ల లెక్కింపులో తేలిపోతుంది.