హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ వినోద దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ పెట్టుబడులు పెట్టనుంది. మీడియా, ఎంటర్టైన్మెంట్ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్‌కు హామీ ఇచ్చింది. ఇందులో 1,200 మంది నిపుణులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌తో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. మీడియా, వినోద రంగంలో హైదరాబాద్‌లో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నట్లుగా వారు కేటీఆర్‌కు తెలిపారు.
ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ఐడీసీని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ కేంద్రం ద్వారా భారతీయ మార్కెట్లోకి ప్రవేశించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ కేంద్రం భారత్‌లోని తమ సంస్థ కార్యకలాపాలకు వ్యూహాత్మక కేంద్రంగా పనిచేస్తుందని చెప్పారు. ఈ ఐడీసీలో మొదటి ఏడాదే సంస్థ 1,200 మంది నిపుణులను నియమించుకోనున్నది. వార్నర్ బ్రదర్స్ సంస్థ టెలివిజన్, ఫిల్మ్, స్ట్రీమింగ్, గేమింగ్‌లో విభిన్నమైన కంటెంట్, బ్రాండ్లు, ఫ్రాంచైజీల్లో వరల్డ్ లీడర్. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ కేంద్రం ఏర్పాటు నిర్ణయంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రపంచ దిగ్గజ సంస్థ తన కార్యకలాపాలను తెలంగాణకు విస్తరించడం ఆనందంగా ఉన్నదని, కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నదని పేర్కొన్నారు.
కేటీఆర్ గత వారం లండన్ లో పర్యటించి పలువురు అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల్ని కలిసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. వెంటనే అమెరికాకు పయనం అయ్యారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం కేటీఆర్ అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఓ పది శాత పెట్టుబడులు మెటీరియలైజ్ అయినా.. కొన్ని వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఏపీలో పెట్టాల్సిన పది వేల కోట్ల అమరరాజా పరిశ్రమ .. అక్కడి ప్రభుత్వ వేధింపులు.. కేటీఆర్ చొరవ కారణంగా తెలంగాణలో ఏర్పాటవతోంది. అక్కడి యువత, మహిళలకు ఉపాధి చూపిస్తోంది.