ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్, ఆయన పార్టీకి చెందిన సానుభూతిపరులు, కార్యకర్తల అత్యుత్సాహం … వైసీపీకే చేటు తెస్తోంది. వ్యతిరేకించిన ప్రతీ ఒక్కర్ని బెదిరించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వ వైఖరికి అనుగుణంగానే వైసీపీ కార్యకర్తలు కూడా చెలరేగిపోతున్నారు. న్యాయమూర్తులపై ఫిర్యాదులు చేస్తూ.. జగన్ చీఫ్ జస్టిస్‌కు లేఖ రాసి.. దాన్ని మీడియాకు విడుదల చేయడంపై దుమారం రేగుతోంది. దాదాపుగా దేశంలో ఉన్న అన్ని బార్ అసోసియేషన్లు జగన్ తీరును ఖండించాయి. అయితే.. ఈ బార్ అసోసియేషన్లకు బెదిరింపు కాల్స్ వెళ్లడం ప్రారంభించాయి. ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ మూడు రోజుల కిందట.. జగన్ తీరును ఖండించింది.
ఆయనపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లేఖ విడుదల చేసింది. ఆ లేఖలో ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ కు చెందిన వారి ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఆ ఫోన్ నెంబర్లకు పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ద యునైటెడ్ కింగ్డమ్ సభ్యుల పేరుతో ఫోన్లు చేసి బూతులు తిట్టడం ప్రారంభించారు. యాక్సిడెంట్లు అవుతాయని.. కుటుంబసభ్యులు ఉన్నారు గుర్తుంచుకోవాలని.. ఇలా రకరకాలుగా బెదిరించడం ప్రారంబించారు. ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ కార్యదర్శి, ప్రెసిడెంట్ ఇద్దరికీ ఇలాంటి బెదిరింపులు వచ్చాయి.
దీంతో వారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి..పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారికి బెదిరింపు కాల్స్ వచ్చిన ఫోన్ నెంబర్ కడప జిల్లా రాజంపేట ఎస్టీడీ కోడ్‌తో ఉందని ఢిల్లీ పోలీసులు గుర్తించారు. అత్యుత్సాహంతో జగన్‌పై అభిమానంతో ఇలాంటి పనులు చేస్తున్న వారు ఆయనకు మరింత చేటు చేస్తున్నారన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. ప్రభుత్వం కూడా మొదటి నుంచి.. తమను ప్రశ్నించిన వారిపై ఇలాగే వ్యవహరిస్తూండంతో.. సానుభూతిపరులు కూడా అదే చేస్తున్నారు. అది ఇప్పుడు తీవ్ర దుమారం రేపే అవకాశం ఉంది.