ఊరక రారు మహానుభావులు అన్నట్లుగా ఈరోజులో రాజకీయ నాయకులు ఏ కారణం ప్రయోజనం లేకుండా సంఘీభావం తెలుపరని అందరికీ తెలుసు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్ధి రోహిత్ మృతికి, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం దీక్షకి సంఘీభావం తెలపడానికి రాజకీయ నాయకులు తరలిరావడం చక్కటి ఉదాహరణలు. రోహిత్ కి న్యాయం చేయాలంటూ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్ధులు చేస్తున్న ఆందోళనకి మద్దతు పలకడానికి దేశంలో ఎక్కడెక్కడి నుండో రాజకీయనాయకులు రెక్కలు కట్టుకొని వాలిపోయారు. రోహిత్ దళిత విద్యార్ధి అవడమే వారి రాకకు ప్రధాన కారణం లేకుంటే అక్కడికి వచ్చివెళ్లినవారు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ కి కూడా తప్పక వెళ్లి ఉండేవారు. ఆ యూనివర్సిటీలో కూడా సరిగ్గా అదే కారణంతో రెండు మూడు రోజుల క్రితం ఒక పి.హె.డి. విద్యార్ధి ఆత్మహత్య చేసుకొన్నాడు. కానీ ఆ విద్యార్ధి దళిత విద్యార్ధి కాకపోవడంతో అదేమీ పెద్ద సమస్యగా వారు భావించినట్లు లేరు.
రోహిత్ కి న్యాయం జరగాలని ఆందోళన చేస్తున్న విద్యార్ధులకు సంఘీభావం తెలపడం వలన మన రాజకీయ నాయకులకు వారు ఆశించిన రాజకీయ ప్రయోజనం కలిగిందో లేదో తెలియదు కానీ మళ్ళీ ఎవరూ ఆ యూనివర్సిటీవైపు తొంగి చూడటంలేదిప్పుడు.
కాపులకు రిజర్వేషన్లు కోరుతూ గత నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభం దంపతులకి సంఘీభావం తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ నుండి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, ఎంపి చిరంజీవి, జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించిన దాసరి నారాయణ రావు తదితరులు బయలుదేరారు కానీ వారిని మధ్యలోనే పోలీసులు అడ్డుకోవడంతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
రఘువీరా రెడ్డి పిసిసి అధ్యక్షుడుగా ఉన్నారు కనుక కాపులను ఆకట్టుకోవడానికో మరి దేనికో ముద్రగడకు సంఘీభావం తెలపాలనుకొంటే అదేమీ అసహజమయిన విషయం కాదు. కానీ తుని విద్వంసం తరువాత ముద్రగడ ఆత్మరక్షణలో పడిపోయినప్పుడు, ఆ విద్వంసం తీవ్రతను చూసి రఘువీరా రెడ్డి ఆయనకు అండగా నిలబడటానికి సంకోచించారు. వైకాపా కూడా అప్పుడు మద్దతుగా మాట్లాడిందే తప్ప ఆయనకు అండగా నిలబడేందుకు ముందుకు రాలేదు. ముద్రగడ ఈ పోరాటం మొదలుపెట్టినప్పుడు ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరించవచ్చో తెలియజేస్తూ చిరంజీవి ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖ వ్రాసి చేతులు దులుపేసుకొన్నారు తప్ప ఆయన కూడా ముద్రగడకు అండగా నిలబడేందుకు రాలేదు.
ఇక దాసరి నారాయణ రావు అసలు ఈ పోరాటంతో తనకి సంబందమే లేదన్నట్లు ఊరుకొన్నారు. కానీ ఈరోజు వారందరూ ఆయనకి సంఘీభావం తెలిపేందుకు హడావుడి బయలుదేరారు! వారిలో చిరంజీవి, దాసరి తమ ‘కాపు’ ఐడెంటిటీని కాపులకు మరొకమారు చాటుకొనేందుకే బయలుదేరి ఉండవచ్చును. కొన్ని రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి స్వయంగా దాసరి నారాయణ రావు ఇంటికి వెళ్లి కలవడం, ఆయన జగన్ న్ని ఆశీర్వదించడం వంటివి గుర్తుతెచ్చుకొంటే బహుశః జగన్ కోరిక మేరకే దాసరి ముద్రగడని కలిసేందుకు బయలుదేరారేమోననే అనుమానం కూడా కలుగుతోంది.
ముద్రగడ ప్రభుత్వంతో చర్చలు జరుపుతుండటం వారు అందరూ చూస్తునే ఉన్నారు. కనుక వారు కూడా మరికొన్ని రోజులు వేచి చూడవచ్చును. కానీ హడావుడిగా బయలుదేరిపోయారు. ఆయన పోరాటానికి సంఘీభావం తెలపడానికే బయలుదేరుతున్నామని వారే చెప్పుకొన్నారు కనుక ఆయనని తన నిరాహార దీక్ష మధ్యలో నిలిపివేయవద్దని కాంగ్రెస్, వైకాపా అధిష్టానాల సందేశాలు ఆయనకు చేరవేసేందుకే బయలుదేరారేమోనని అనుమానించవలసి వస్తుంది. ఎందుకంటే ముద్రగడ తన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగించినంత వరకే కాంగ్రెస్, వైకాపాలు ప్రభుత్వంతో యుద్ధం కొనసాగించగలవు. కానీ ఆయన ఆ రెండు పార్టీలను నిరాశ పరుస్తూ తన దీక్షని విరమించేసారు. కనుక ఆయన నిర్ణయం ఆ రెండు పార్టీలకు చాలా నిరాశ కలిగించి ఉండవచ్చును.
ఆయనకు సంఘీభావం తెలపడానికి బయలుదేరిన నేతలందరికీ కాపులకు రిజర్వేషన్లు సాధించాలనే చిత్తశుద్ధి, ముద్రగడ పోరాటం పట్ల నిజంగా ఆసక్తి ఉన్నట్లయితే ఇప్పుడు వారందరూ వెళ్లి ఆయనను కలిసి సంఘీభావం చెప్పవచ్చును. బహుశః యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్ధులను రాజకీయ నాయకులు పట్టించుకొనట్లుగానే, ఇప్పుడు ముద్రగడని కూడా పట్టించుకోవడం మానేస్తారేమో? కనుక ఈరోజుల్లో సంఘీభావాలు కూడా ఫ్రీగా దొరకవని గ్రహించాలి.