మంత్రి హరీష్ రావును టీఆర్ఎస్ పార్టీలో మరోసారి ఘోరంగా అవమానించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. దానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ప్రచారసభలో ఆయన ఎక్కడా కనిపించకపోవడమే. ఎల్బీనగర్లో శనివారం టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రచారసభలో హరీష్ రావు ఎక్కడా కనిపించలేదు. స్టేజి మీద చాలా మంది నేతలు కనిపించారు కానీ..కీలకమైన మంత్రి పదవిలో ఉండటమే కాదు.. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోకి వచ్చే కొన్ని గ్రేటర్ డివిజన్ల బాధ్యతలు కూడా చూస్తున్న హరీష్ రావును సభలో అసలు పట్టించుకోలేదు. దీంతో హరీష్ ను పూర్తిగా పక్కన పెట్టేసినట్లేనని.. చెప్పుకోవడం ప్రారంభించారు.
దుబ్బాక ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి తర్వాత సహజంగానే… అందరి చూపు హరీష్ రావు వైపు పడింది. బాధ్యత తనదేనని నిర్మోహమాటంగా ఆయన ప్రకటించుకున్నారు. గతంలోనే కేసీఆర్ జరుగుతున్న ఎన్నికలన్నింటికీ మంత్రులదే బాధ్యతని చెబుతూ వస్తున్నారు. ఇప్పటికిప్పుడు హరీష్‌పై కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు కానీ.. భవిష్యత్‌లో తీసుకోబోయే అవకాశాలకు మాత్రం తాజా పరిణామాలు నిదర్శనంగా కనిపిస్తున్నాయన్న చర్చ జరుగుతోంది. నిజానికి రెండో సారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ కు ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయింది. మంత్రి పదవి కూడా అతి కష్టం మీద లభించింది. దుబ్బాక ఉపఎన్నిక ఓటమితో ఇప్పుడా మంత్రి పదవికి కూడా గండం వచ్చి పడిందన్న చర్చ.. ఎల్బీ నగర్ సభ తర్వాత మరింతగా పెరిగింది.
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధిస్తే… ప్రచారాన్ని ఒంటి చేత్తో నిర్వహించిన కేటీఆర్‌కు అడ్వాంటేజ్ అవుతుంది. అప్పుడు హరీష్ ప్రాముఖ్యత మరింత తగ్గుతుందనడంలో సందేహం ఉండదు. గ్రేటర్ ఎన్నికల్లో కూడా దుబ్బాక లాంటి ఫలితం వస్తే.. బీజేపీ హవా ఉంది కాబట్టి.. హరీష్ అయినా.. కేటీఆర్ అయినా ఏమీ చేయలేకపోయారన్న వాదన వినిపించవచ్చు. అయితే .. దుబ్బాక ఉపఎన్నిక, ఎమ్మెల్సీ, గ్రేటర్ ఎన్నికల తర్వాత మంత్రివర్గాన్ని కేసీఆర్ పునర్ వ్యవస్థీకరించే అవకాశం ఉంది. అందుకే ఈ చర్చ జరుగుతోంది.