తను నిర్మించే సినిమాలకు రేటింగ్స్ తో నిమిత్తం లేకుండా ప్రచారం చేసి.. ప్రేక్షకులకు చేరువ చేయడం లగడపాటి శ్రీధర్ కి ముందు నుంచి అలవాటు. ఆయన నిర్మించిన తొలి చిత్రం ‘ఎవడి గోల వాడిది’కి కూడా ముందు ప్లాప్ టాక్ వచ్చింది. కానీ తనదైన శైలిలో పబ్లిసిటీ చేసి దాన్ని సూపర్ హిట్ సినిమాగా మలిచిన ఘనత శ్రీధర్ ది.
అలాంటిది.. ‘నా పేరు సూర్య’ లాంటి భారీ బడ్జెట్ సినిమాకి సరైన ప్రచారం చేయనివ్వకుండా అల్లు ఫ్యామిలీ లగడపాటి చేతులు కట్టేసిందని శ్రీధర్ సన్నిహితులు వాపోతున్నారు.
పైగా ‘మహానటి’ కి పోటీగా నాలుగు రోజుల ముందు విడుదలైన ‘నా పేరు సూర్య’ చిత్రం యూనిట్ మొత్తానికి అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఘన సన్మానం చయడాన్ని లగడపాటి జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది.
అలాగే ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో అల్లు అర్జున్ చురుగ్గా పాలుపంచుకోకపోవడం కూడా చర్చనీయాంశంగా మారడం తెలిసిందే. మిలిటరీ మాధవరంలో జరిగిన ఆడియో ఫంక్షన్ కి, పవన్ కళ్యాణ్ హాజరైన థ్యాంక్స్ మీట్ కి హాజరవ్వడం తప్ప.. అల్లు అర్జున్ ఈ సినిమాని స్పెషల్ గా ప్రమోట్ చేయలేదు. ఇక హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ అయితే పొరపాటున కూడా పబ్లిసిటీ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయలేదు. పోనీ తనయినా ఎదో రకంగా తంటాలు పడదామంటే.. అందుకు కూడా అల్లు అండ్ కో అంగీకరించలేదని తెలుస్తోంది!!