మాజీ ముఖ్యమంత్రి, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నేత, వెండితెర మేరునగధీరుడిగా చరిత్రలో నిలిచిపోయిన ఎన్టీ రామారావుకు కేంద్రం అరుదైన గౌరవం ఇస్తోంది. ఆయన శతజయంతి సందర్భంగా రూపొందించిన వంద నాణెన్ని ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన ఆవిష్కరించనున్నారు. రాష్ట్రపతి ముర్ము.. రాష్ట్రపతి భవన్ లో జరిగే కార్యక్రమంలో ఈ నాణెన్ని విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబసభ్యులతో పాటు వంద మందికి ఆహ్వానం పలికారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రకటించారు.
ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. పదేళ్లుగా బీజేపీలో కీలక పాత్ర పోషిస్తున్న ఆమె నాణెం విడుదలకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నాణెం ఎలా ఉండాలన్నది కూడా ఆర్బీఐ ఆమెతోనే సంప్రదించింది. ఆహ్వానాలు కూడా ఆమె చాయిస్ గా నే పంపి ఉంటారని భావిస్తున్నారు. కానీ ఎవరెవరికి ఆహ్వానం పలికారన్నదానిపై స్పష్టత లేదు. చంద్రబాబు సహా కుటుంబసభ్యులంతా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
అయితే లక్ష్మి పార్వతి కి ఆహ్వానం ఉంటుందా ఉండదా అన్నది సస్పెన్స్ గా మారింది. ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించకపోవడానికి కారణం.. ఒక వేళ ప్రకటిస్తే.. దాన్ని అందుకునే చాన్స్ లక్ష్మిపార్వతికి వచ్చే అవకాశం ఉంటుందని అందుకే పట్టుబట్టడం లేదని చెబుతున్నారు. లక్ష్మిపార్వతి వల్లే ఎన్టీఆర్ చనిపోయారని.. కుటుంబానికి చివరి రోజుల్లో దూరంగా ఉన్నారని అందరి నమ్మకం. ప్రోటోకాల్ అంటూ ఈ నాణెం ఆవిష్కరణకు ఏమీ ఉండదు కాబట్టి పిలవకపోవడానికే ఎక్కువ వకాశం ఉందని భావిస్తున్నారు.