ఏదైనా పార్టీ బహిరంగసభ ఏర్పాటు చేస్తే ఆ సభపైనే అందరి ఫోకస్ ఉండాలనుకుంటారు. కానీ తెలంగాణ బీజేపీ తీరు మాత్రం దానికి భిన్నంగా ఉంది. సభ జరిగక ముందు కానీ.. జరుగుతున్నప్పుడు కానీ.. జరిగిపోయిన తర్వాత కానీ మునుగోడు సభ గురించి ఎక్కడా చెప్పుకోవడం లేదు. పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారని చెప్పుకోవడం లేదు. కుప్పలు తెప్పలుగా నేతలు వచ్చి పార్టీ కండువాలు కప్పించుకున్నారని కూడా చెప్పడం లేదు. చెప్పుకోవడానికి ఎవరూ చేరలేదు. రాజగోపాల్ రెడ్డి ఒక్కరు మాత్రమే చేరారు. అక్కడ సభకు కూడా పెద్ద ఎత్తున జనాలు తరలి రాలేదు.
అమిత్ షా వస్తున్నారని నల్లగొండ చుట్టుపక్కల నుంచి కూడా జనాలను సమీకరించారు. అయితే ఇంత చేసినా.. భారీ స్థాయిలో సభ జరగలేదు. లోకల్ కార్యకర్తలు మాత్రే హాజరయ్యారు. ఈ పరిస్థితిని ముందుగానే ఊహించారేమో కానీ.. ఎన్టీఆర్ ఎపిసోడ్‌కే ప్రాధాన్యం ఇచ్చారని చెబుతున్నారు. మునుగోడులో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనుకుంటున్న బీజేపీ బలప్రదర్శన చేశామని చెప్పుకోవడానికి బదులు…. ఏమాత్రం అవసరం లేని అంశాలపై ఫోకస్ చేసి.. తమ సభను తాము తక్కువ చేసుకుంటున్నారు.
పైగా.. తమసభకు జనాలు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారన్న వాదనను.. రాజగోపాల్ రెడ్డి చేస్తున్నారు. ఇది ఆ పార్టీ దుస్థితిని తెలియచేస్తోందంటున్నారు. సంస్థాగతంగా బీజేపీ అక్కడ బలంగా లేదు. కానీ రాజగోపాల్ రెడ్డి అందర్నీ ఆకర్షిస్తారని అనుకున్నారు. కానీ అక్కడ జరిగింది వేరు. చివరికి ఇతర చేరికలను కూడా ఖరారు చేయించలేకపోయారు. దీంతో మునుగోడు సభ ఫ్లాప్ అయిందన్న ప్రచారం చాపకింద నీరులా సాగుతోంది.