దర్శకుడు ప్రశాంత్ వర్మ తీసినవి అది కొద్ది సినిమాలే అయినా ఇప్పటికే విభిన్న దర్శకుడు గా పేరు సంపాదించాడు. అయితే తాజాగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక సీనియర్ హీరో తనను ఎలా అవమానించిందీ ప్రశాంత్ వర్మ వివరించాడు. అయితే ఆయన చెప్పిన మాటలను బట్టి చూస్తే అలా అవమానించిన హీరో డాక్టర్ రాజశేఖర్ ఏమో అన్న సందేహాలు నెటిజన్లలో కలుగుతున్నాయి వివరాల్లోకి వెళితే.
దర్శకుడు ప్రశాంత్ వర్మ చదువుల్లో రాష్ట్రస్థాయిలో టాపర్ గా నిలవడమే కాకుండా, క్రికెట్లో జిల్లా స్థాయిలో కూడా ఆడారు. ఆ తర్వాత దర్శకుడు అవుదామని సినీ పరిశ్రమకు వచ్చారు. ఇండస్ట్రీలో తన ఎదుర్కొన్న ఒకట్రెండు చేదు అనుభవాల గురించి ఆయన ఇంటర్వ్యూలో వివరించారు. అసిస్టెంట్ దర్శకుడిగా అవకాశం కోసం ఒక దర్శకుడి దగ్గరకు వెళితే చాలా సేపు వెయిట్ చేయించుకొని ఆ తర్వాత తనతో మంచినీళ్లు తెప్పించుకోవడం వంటి పనులు చేయించుకున్నారని ప్రశాంత్ వర్మ వివరించారు. ఇంత చదువు చదివి , ఇలాంటి ట్రీట్మెంట్ కు గురవుతున్నామనే బాధ అప్పట్లో కలిగేదని ఆయన వివరించారు. అయితే దాని కన్నా తనను జీవితంలో అత్యంత ఫ్రస్ట్రేషన్ కు గురి చేసిన సంగతి ఒకటి ఆయన వివరించారు.
ఒకసారి పెద్ద హీరో కు కథ చెబుదామని ఆయన ఇంటికి వెళితే, బయట వెయిట్ చేయమని ఆయన ఫోన్లో చెప్పారట. ఆయన ఇంటి గేటు బయట అలా చాలా సేపు వెయిట్ చేస్తూ ఉంటే ఈ లోగా వర్షం మొదలైందట. తలెత్తి పైకి చూస్తే ఆ హీరో కిటికీ లోంచి తననే చూస్తూ ఉన్నాడట. కనీసం లోపలికి పిలవకుండా గేటు బయట వర్షం లో నిలబెట్టిన ఆ హీరో పై ఎంతగానో కోపం వచ్చినప్పటికీ తమాయించుకుని వెళ్లి ఆ హీరోకి కథ చెప్పి వచ్చాడట ప్రశాంత్ వర్మ. ఆ తర్వాత ఆ హీరోతో కలిసి సినిమా కూడా చేశానని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు. అయితే ప్రశాంత్ వర్మ తీసింది మూడే సినిమాలు. అ! అనే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా, కల్కి అనే రాజశేఖర్ సినిమా, జాంబి రెడ్డి సినిమా. ఈ మూడు సినిమాలలో ప్రశాంత్ వర్మ పెద్ద హీరోతో పని చేసిన ఏకైక సినిమా కల్కి కావడంతో, ప్రశాంత్ వర్మ ని ఆ విధంగా అవమానించిన హీరో డాక్టర్ రాజశేఖర్ అయి ఉండవచ్చన్న విశ్లేషణలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
మరి నెటిజన్ల గెస్ ఎంతవరకూ కరెక్ట్ అన్నది ప్రశాంత్ వర్మ ఏదో ఒకరోజు ఆ పేరు బయట పెడితే గాని తెలియదు.