ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల పరిధిలో పండిన పంటలను వాడకూడదని.. కాలుష్య నిపుణుల బృందం సిఫార్సు చేసింది. కేంద్రం నియమించిన సీఎస్ఐఆర్- ఎన్ఈఈఆర్ఐ నిపుణుల బృందం అక్కడి గ్రామాలన్నింటినీ పరిశీలన జరిపి.. కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఐదు గ్రామాల్లోని పశువుల నుంచి సేకరించిన పాలు తాగడం కూడా మంచిది కాదని.. నివేదికలో స్పష్టం చేసింది. ఆయా గ్రామాల్లో పెరిగిన గడ్డిని కూడా ..పశువులకు ఆహారంగా ఇవ్వొద్దని తెలిపింది. తాగు, వంట కోసం బహిరంగ జల వనరులు వాడొద్దని స్పష్టంచేసింది. ప్రభావిత ప్రాంతాలను సోడియం హైడ్రోక్లోరైడ్ ద్రావణంతో శుభ్రపరచాలని వాహనాలను సైతం శుభ్రపరిచాకే వాడాలని నిపుణులు తేల్చారు.
ఎల్డీ పాలిమర్స్ చుట్టుపక్కల ఐదు గ్రామాల ప్రజల ఆరోగ్యంపై గ్యాస్ లీక్ తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. విష వాయువు ప్రభావానికి గురైన వారు సంవత్సరం పాటు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలన్నారు. అక్కడ ఇళ్లలో స్టైరిన్ అత్యధికంగా ఉందని..నివాసాలు పూర్తిగా శుభ్రపరిచాకే తిరిగి వెళ్లాలని నిపుణుల బృందం సూచించింది. విశాఖకు నీరు అందించే మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ సమీపంలోనే ఉంది. నిపుణులనివేదిక ప్రకారం.. ఈ నీటిని ఇక ఉపయోగించుకోలేరు.
గ్యాస్ లీక్ ఐదు గ్రామాల ప్రజల జీవన విధానాన్నే మార్చేయనుంది. అక్కడి ప్రజలకు దీర్ఘ కాలంలో ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదమే కాదు.. జీవనాధారం అయిన వ్యవసాయం, పశుసంపద కూడా…పనికి రాకుండా పోయింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని అందరూ గ్రామాలకు వెళ్లవచ్చని చెప్పింది. దాంతో ఇప్పటి వరకూ..స్కూళ్లలో..ఇతరచోట్ల షెల్టర్ తీసుకున్న జనం గ్రామాలకు వెళ్తున్నారు. కానీ అక్కడ స్వచ్చమైన గాలి లేదని… నివేదికలు వస్తూండటంతో భయందోళనలకు గురవుతున్నారు.