వైసీపీ నాయకులు ఏం చేసినా అవినీతి కనిపిస్తుందని ఊరకనే ఆరోపణలు రావు .. దానికి బలమైన కారణాలు ఉంటాయి. తాజాగా తిరుమలలో శ్రీవారి భక్తులను మంచి నీటి పేరుతో పిండుకుంటున్న దందా జోరుగా సాగుతోంది. తిరుమలలో ఇప్పుడు ఒక్క లీటర్ బాటిల్ రూ. 55 రూపాయలు. ఆ నీళ్లు ఇచ్చే బాటిల్ తిరిగి తీసుకొచ్చి ఇస్తే రూ. 30 తిరిగి ఇస్తారు. అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇటీవల తిరుమలలో ప్లాస్టిక్ బ్యాన్ చేశారు. చివరికి పిల్లల పాల బాటిల్స్‌ను కూడా తీసుకెళ్లనీయడం లేదు. ఇక వాటర్ బాటిళ్లను ఎలా తీసుకెళ్లనిస్తారు.
పైకెళ్లేసరికి ఎక్కడా వాటర్ కనిపించవు. జల ప్రసాదం పేరుతో టీటీడీ ఏర్పాటు చేసినవి కొన్నే ఉన్నాయి. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను కూడా తెచ్చుకోనివ్వకపోవడంతో ఆ జల ప్రసాదాన్ని బాటిళ్లలో పట్టుకునే పరిస్థితి లేదు. ఈ బాధలు పడలేని వాళ్లు వాటర్ బాటిల్ కొనుక్కుందామని వెళ్తున్నారు. అక్కడ గ్లాస్ సీసాలో ఉన్న వాటర్ దర్శనమిస్తాయి. ఎంత అంటే.. యాభై ఐదు రూపాయలు. ఏంటి ఒక్క లీటర్ వాటర్ యాభై ఐదు రూపాయలా అని ఎవరైనా ఆశ్చర్యపోతే .. తాగి బాటిల్ ఇస్తే.. రూ. ముఫ్పై వెనక్కి తిరిగి ఇస్తామని చెబుతారు. ఇస్తారు కూడా. ఇవ్వలేని వాళ్లు తీసుకెళ్లిపోతారు.
మరి ఇచ్చిన బాటిళ్లను షాపు ఓనర్లు ఏం చేస్తారు ? వెంటనే పక్కన జల ప్రసాదం దగ్గరకు వెళ్లి ట్యాప్‌లో నీళ్లు పట్టుకెళ్లి తీసుకొచ్చి అక్కడ పెడతారు. అంటే.. బాటిల్ ముఫ్పై.. లీటర్ వాటర్ పాతిక రూపాయలన్నమాట. ఈ వాటర్ బిజినెస్ ఇప్పుడు తిరుమలలో రూ. కోట్లకు చేరింది. ఎంత మంది భక్తులు వస్తే అంత వ్యాపారం. మొత్తం ఇద్దరు వైసీపీ నేతల కనుసన్నల్లో ఈ బిజినెస్ జరుగుతోందని తిరుమల కొండ మొత్తం చెప్పుకుంటున్నారు. చివరికి చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మల ప్లాస్టిక్ కూడా కనపడకుండా చేసిన టీటీడీ .. భక్తులకు ప్రత్యామ్నాయాలు మాత్రం చూపెట్టలేదు. వారిని వైసీపీ నేతల వ్యాపారానికి వదిలేసిందన్న విమర్శలు ఎదుర్కొంటోంది.