కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాలపై చర్చించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో కేంద్ర జల శక్తి శాఖ నిర్వహించనున్న అపెక్స్ కౌన్సిల్ భేటీ ఆసక్తికరంగా మారింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాదనలను బలంగా వినిపించేందుకు రంగం సిద్దం చేసుకున్నాయి. అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేంద్రం ముందు లేవనెత్తాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అనేక సార్లు అధికారులు, ఇంజనీర్లతో చర్చించారు. కేంద్రజలశక్తి మంత్రికి లేఖ కూడా రాశారు. అక్రమంగా నీటి తరలింపు కోసమే పొతిరెడ్డి పాడు ఎత్తు పెంపు, రాయలసీమ ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నారని కనుక శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత తమకే అప్పగించాలని కేసిఆర్ లేఖలో కోరారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ఏపి సిఎం హోదాలో అధితిగా పాల్గొన్న జగన్ ఇప్పుడు ఆ ప్రాజెక్టును అక్రమం అని ఫిర్యాదులు చేయడం ఏమిటని కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్లో వాదించే అవకాశం ఉంది. మరో వైపు సీఎం జగన్ కూడా కృష్ణా జలాల్లో రావలసిన వాటానే కోరదామని ఏపీ సీఎం జగన్ అధికారులకు సూచించారు. గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల పర్యవేక్షణ కేంద్రానికి అప్పగిద్దామని.. రెండు బోర్డుల పరిధి తేల్చాలని డిమాండ్ చేయాలని నిర్ణయించారు. కృష్ణా బోర్డును విజయవాడకు తరలించాలని డిమాండ్ చేయాలని.. అపెక్స్ కౌన్సిల్ సన్నాహక భేటీలో అధికారులకు సీఎం జగన్ సూచించారు. గతంలో రెండు సార్లు అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరుగాల్సి ఉన్నా.. వాయిదా పడింది. ఇప్పుడు జరుగుతోంది.
నిజానికి పొరుగు రాష్ట్రాలతో కేసీఆర్ జల వివాదాల పరిష్కారానికి ఇచ్చిపుచ్చుకునే వ్యూహాన్ని అవలంభిస్తూ ఉంటారు. మహారాష్ట్రతో ఇలా ఒప్పందాలు చేసుకుని ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేశారు. కర్ణాటకతోనూ సత్సంబంధాలు పెట్టుకున్నారు. ఆయా రాష్ట్రాలను మించి రాజకీయంగా ఏపీ సీఎంతో ఆయనకు సన్నిహిత సంబధాలు ఉన్నాయి. జగన్ ప్రమాణస్వీకారానికి వెళ్లి బేసిన్లు.. బేషజాలు లేవని గర్వంగా ప్రకటించారు. కేంద్రం అవసరం లేకుండానే వివాదాలు పరిష్కరించుకుంటామన్నారు. అయితే.. రాజకీయంగా వారి స్నేహం అలాగే ఉన్నప్పటికీ… బేసిన్లు.. బేషజాలు మాత్రం ఎక్కడికీ పోలేదు. ఫలితంగా వివాదాలు వచ్చి పడ్డాయి.
రాయలసీమకు నీరు అందించాలన్న లక్ష్యంతో ప్రాజెక్టులు చేపట్టినట్లుగా ఏపీ సర్కార్ చెబుతోంది. చేపట్టిన ప్రాజెక్టులు కూడా అలాంటివే. అయితే.. వీటికి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకుండా… తన రాజకీయ స్నేహాన్ని ఏపీ సీఎం ఉపయోగించాల్సి ఉంది. అలా కాకుండా రాజకీయం కోసం జల వివాదాలను వాడుకుంటే… సీమ ప్రజలకు తీరని నష్టం జరుగుతుంది. అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఈ మేరకు ఏపీ, తెలంగాణ సీఎంలు ఎలాంటి వ్యూహం అవలంభిస్తారన్నది కీలకంగా మారింది.