హైదరాబాద్ ని విశ్వ నగరంగా తీర్చిదిద్దుతామని పాలకులు డంబాలు పలకడం అటుంచితే, తాగడానికి, వాడుకోవటానికి నీటి సౌకర్యం సరిగ్గా లేక హైదరాబాద్ వాసులు విలవిలలాడుతున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని వాటర్ ట్యాంకర్ మాఫియా రెచ్చిపోతుంటే అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. మీడియా ఏమో రాజకీయ వార్తల తోను, సంచలన వార్తల తోను బిజీగా ఉంది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ లో నీటి కష్టాలు తారస్థాయికి చేరుకున్నాయి. ప్రతిరోజు రావలసిన మున్సిపల్ వాటర్ రోజు మార్చి రోజు కాదు కదా దాదాపు పది రోజులకు ఒకసారి రావడం కూడా గగనం అయిపోయింది. ఎండలు మండిపోవడం తో భూగర్భ జలాలు కూడా ఎండి పోయాయి. దీంతో గుక్క నీరు దొరక్క పూర్తిగా వాటర్ ట్యాంకర్ల మీద హైదరాబాద్ నగరం ఆధార పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రత్యేకించి నగరం లో ని శేర్లింగంపల్లి, కూకట్ పల్లి, రాజేంద్రనగర్, అమీర్పేట్ తదితర ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో తాగడానికి వాడుకోవడానికి కూడా వాటర్ ట్యాంకర్ల మీద ఆధార పడాల్సిన పరిస్థితులు హైదరాబాద్ వాసులకు ఏర్పడ్డాయి. దీని అదునుగా తీసుకుని వాటర్ ట్యాంకర్లు కూడా రేటు అమాంతం పెంచడంతో మధ్య తరగతి వాళ్ళ పరిస్థితి ప్రత్యేకించి ఘోరంగా ఉంది. సాధారణ సమయాల్లో 500 రూపాయల నుండి 800 రూపాయల మధ్యలో ఉండే ఒక వాటర్ ట్యాంక్ ధర ప్రస్తుతం 2,000 నుండి 3,000 మధ్యలో నడుస్తోంది. దీంతో నెలకు వేలకు వేలు కేవలం నీటికి చెల్లించాల్సి వస్తోందని నగరవాసులు వాపోతున్నారు.
హైదరాబాద్ తో పోలిస్తే మరింత ఎక్కువగా నీటి ఎద్దడి ఉండాల్సిన నగరాలలో ప్రభుత్వ , అధికారులు చొరవ కారణంగా పరిస్థితి కాస్త నియంత్రణలో ఉండగా, హైదరాబాద్ లో మాత్రం అటు ప్రభుత్వం ఇటు అధికారులు చేతులు ఎత్తి వేసినట్లు గా కనిపిస్తోంది. తదుపరి వర్షం వస్తే తప్ప మున్సిపల్ వాటర్ వచ్చే అవకాశం లేని పరిస్థితి ఉండడం ప్రత్యామ్నాయ ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం, అధికారులు ప్రదర్శించిన అలసత్వాన్ని సూచిస్తోంది. మహాప్రభో, విశ్వనగరం సంగతి తర్వాత ముందు మంచి నీళ్ళు, కరెంటు సక్రమంగా ఇవ్వండి చాలు అంటూ నగరవాసులు వాపోతున్నారు.