కృష్ణా, గోదావరి నీటి కోసం ఏపీ, తెలంగాణల మధ్య తలెత్తిన జలయుద్ధం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ అక్రమంగా ప్రాజెక్టులు కడుతోందని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. దీంతో తామెందుకు వెనకబడాలన్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అదే పల్లవి అందుకున్నారు. కేంద్రం జోక్యం చేసుకుని ప్రాజెక్టుల నిర్మాణం ఆపాలంటూ కేబినెట్ భేటీలో తీర్మానం కూడా చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలోనే కేటాయించిన ప్రకారం నీటిని వాడుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నారు. తమ వాటా 1300 టీఎంసీల నీటిని పూర్తిగా వాడుకుని ప్రాజెక్టును నిర్మించుకుంటాని ఘంటాపథగా చెప్పేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్ల విషయంలో న్యాయం పొందడానికి అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
రెండు రాష్ట్రాలు తమ వాదనకు కట్టుబడి ఉన్నాయి. తెలంగాణలో కాళేశ్వరం, డిండి సహా అనేక ప్రాజెక్టు పనులకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో వెనక్కి వెళ్లేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆంధ్రా పాలకుల కుట్రలను తిప్పికొట్టడానికి తెలంగాణలోని రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. అంటే మరోసారి భావోద్వేగాలు కీలక పాత్ర పోషించే పరిస్థితి కనిపిస్తోంది.
ఈ సమయంలో సమస్యను పరిష్కరించాల్సింది కేంద్ర ప్రభుత్వమే. తమకు కేటాయించిన నీటిని వాడుకునే హక్కు ఉందనే తెలంగాణ వాదనలో న్యాయం ఉందా? అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్నారన్న ఏపీ వాదనలో నిజముందా? వాస్తవాల ఆధారంగా నిగ్గు తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వమే.
రాగ ద్వేషాలకు అతీతంగా మోడీ ప్రభుత్వం వాస్తవాలను గమనంలోకి తీసుకోవాలి. స్థానిక పరిస్థితులు, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కేటాయింపులు, ఒప్పందాలను కూడా పరిగణన లోకి తీసుకోవాలి. ఈ వివాదాన్ని ఇలాగే వదిలేస్తే చాలా దూరం పోయే ప్రమాదం ఉంది. ఇదివరకే నాగార్జున సాగర్ డ్యాం వద్ద రెండు రాష్ట్రాల పోలీసులు ఘర్షణ పడిన సీన్ చూశాం. అది మరోసారి జరగకూడదంటే కేంద్రమే హుందాగా, నిష్పక్షపాతంగా నిర్ణయం వెలువరించాలి. రెండు రాష్ట్రాలనూ ఒప్పించాలి.