మూడున్నర దశాబ్దాలుగా వామపక్షాలు ఎంతో కష్టపడి పశ్చిమ బెంగాల్లో నిర్మించుకొన్న కంచుకోటను 2011 సార్వత్రిక ఎన్నికలలో బ్రద్దలుకొట్టి అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ, మళ్ళీ ఏప్రిల్ 4 నుండి మే6 వరకు ఆరు దశలలో జరుగబోయే శాసనసభ ఎన్నికలలో విజయం సాధించి తన అధికారం నిలబెట్టుకోవడానికి అందరికంటే ముందు సిద్దమయిపోయారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే తన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల పేర్లను ప్రకటించేసి ఎర్ర, కాషాయ, మువన్నెల రంగుల పార్టీలకి మొట్ట మొదటి షాక్ ఇచ్చేరు. మిగిలిన పార్టీలన్నీ ఆమెను ఏవిధంగా ఎదుర్కోవాలాని ఆలోచిస్తూ కూర్చొంటే, ఆమె నిన్న తన పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను కూడా విడుదల చేసేసి వాటికి మరో షాక్ ఇచ్చేరు. ఈ ఎన్నికల రేసులో అందరి కంటే తమ పార్టీయే ముందున్నట్లు చాటుకోగలిగారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలలో 80శాతం పూర్తి చేసామని, ఎన్నికలలోగా మిగిలిన 20శాతం హామీలను కూడా పూర్తి చేసి చూపిస్తామని చెప్పారు. ఒకప్పుడు వామపక్షాల హయంలో రాష్ట్రంలో దళితులు, బలహీన, మైనార్టీవర్గాలపై దాడులు జరిగేవని తాము అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అరికట్టగలిగామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో హిందూ, ముస్లిం, క్రీస్టియన్ తదితర మతస్తులనందరినీ ఒక్క త్రాటిపైకి తీసుకురాగలిగామని చెప్పారు. వామపక్షాల హయంలో తీవ్రంగా దెబ్బ తిన్న రాష్ట్ర ఆర్ధికస్థితిని తన ప్రభుత్వం చక్కదిద్ది రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టిందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు కలిగించే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, పధకాలను తమ ప్రభుత్వం చేప్పట్టిందని, మళ్ళీ తాము అధికారంలోకి వస్తే వాటిని మరింత జోరుగా కొనసాగిస్తామని చెప్పారు. తమది చేతల ప్రభుత్వమే తప్ప మాటల ప్రభుత్వం కాదని ఆమె చెప్పారు. తమ పార్టీకి చిల్లర రాజకీయాలు చేసి ఓట్లు సంపాదించుకోవాలనే ఆలోచనలేదన్నారు. 146 పేజీలు గల తృణమూల్ ఎన్నికల మానిఫెస్టోలో 12 పేజీలలో ‘మొదటి మాట’ని మమతా బెనర్జీ స్వయంగా వ్రాయడం విశేషం.