కరోనా ఇక ఎక్కడికి పోదని.. మనం ఆ వైరస్‌తో కలిసి జీవించాల్సిందేనన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేశారు. 80 శాతం మందికి అసలు కరోనా సోకిందో లేదో తెలియకుండానే నయమవుతోందని .. స్వైన్ ఫ్లూ తరహాలో జాగ్రత్తలు తీసుకుంటే చాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. కరోనా సోకిన వారిలో 80 శాతం మందికి ఇంట్లోనే నయమవుతోందని కేవలం 14 శాతం మందికి మాత్రమే ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంన్నారు. ఏ లక్షణాలు లేకుండానే ప్రస్తుతం పెద్ద ఎత్తున కరోనా వైరస్ బయటపడుతోందని గుర్తు చేశారు. పెద్ద వారి విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని.. ఇది జ్వరం కంటే ఎక్కువ కాదని స్పష్టం చేశారు.
ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన సందర్భంగా.. ప్రజలకు ఓ రికార్డెడ్ వీడియో సందేశాన్ని ఐ అండ్ పీఆర్ విడుదల చేసింది. కరోనా సోకడం అంటరాని తనం కాదని జగన్ ఈ వీడియోలో స్పష్టం చేశారు. రేప్పొద్దున తనకైనా రావొచ్చని… అది జ్వరంలాంటిదేనని జగన్ స్పష్టం చేశారు. కరోనా సోకిన వారి పట్ల వివక్ష చూపాల్సిన అవసరం లేదన్నారు. రోగనిరోధక శక్తి పెంచుకోవాలని… ప్రజలకు జగన్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో రెడ్,ఆరెంజ్, గ్రీన్ జోన్లను గుర్తించామన్న జగన్… ఇప్పటికే.. రెడ్, ఆరెంజ్ జోన్లలో ఉన్న వారిలో 70శాతం మందికి పరీక్షలు పూర్తి చేశామన్నారు. దేశంలో అత్యంత ఎక్కువగా 74551 టెస్టులను పూర్తి చేశామని గుర్తు చేశారు.
కరోనా ఎదుర్కోవడానికి తాము ఏ మాత్రం నిర్లక్ష్యంగా లేమని.. అన్ని రకాల ఏర్పాట్లతో సిద్దంగా ఉన్నామని సీఎం తెలిపారు. నాలుగు చోట్ల క్రిటికర్ కేర్ ఆస్పత్రులు.. పీపీఈలు.. ఎన్ 95మాస్కులు అన్నీ సమృద్ధిగా ఉన్నాయన్నారు. క్వారంటైన్ సెంటర్లలో ఉన్న వారికి బలవర్థమైన ఆహారం ఇస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా.. ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ల గురించి.. జగన్ వివరించారు. 80 శాతం రాష్ట్రం ఆరెంజ్ జోన్లోనే ఉందని చెప్పిన సీఎం… కరోనా ఎక్కడికీ పోదని చెప్పడం ద్వారా.. లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఇవ్వబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారని భావిస్తున్నారు.