ఢిల్లీ జుత్తు మన చేతిలో ఉండాలంటే, కేంద్రాన్ని యాచించి కాదు… శాసించి తెలంగాణకు నిధులు తెచ్చుకోవాలంటే కీలెరిగి వాత పెట్టాలన్నారు కేటీఆర్. జహీరాబాద్ లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ… లోక్ సభ ఎన్నికల్లో మరోసారి తెలంగాణ సత్తా, పౌరుషాన్ని చూపాలన్నారు. 16 మంది ఎంపీలతో సీఎం కేసీఆర్ ఏం చేయగలరంటూ కొంతమంది బీజేపీ నాయకులు అంటున్నారనీ, ఇద్దరే ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మొనగాడు కేసీఆర్ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. పదహారు మందితో ఢిల్లీ మెడలు వంచుతారన్నారు. కాంగ్రెస్ నాయకులు మళ్లీ కొత్తగా సవాల్ చేస్తున్నారనీ, లోక్ సభ ఎన్నికలతో కేసీఆర్ కి సంబంధమేంటని అంటున్నారని అన్నారు.
ఈ ఎన్నికలు తెలంగాణకు అత్యంత కీలకమనీ, పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదాను ప్రధాని మోడీ ఇచ్చారన్నారు. కానీ, తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు అడిగితే కేంద్రం ఇవ్వలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల మా భూములు మునిగిపోతున్నా ఓర్చుకున్నామనీ, ఖమ్మం జిల్లాలో గిరిజనులు మునుగుతున్నా రైతులకు న్యాయం జరుగుతోందని భావించామన్నారు కేటీఆర్. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం అభ్యంతరం లేదనీ, కానీ తెలంగాణకు కూడా న్యాయం చెయ్యాలన్నారు. 16 మంది ఎంపీలు పార్లమెంటులో ఉంటే… కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తన్నుకుంటూ వస్తుందన్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి వచ్చి తెలంగాణకు కేంద్రం నిధులు ఇచ్చి వెళ్లే పరిస్థితి వస్తుందన్నారు. మోడీ గ్రాఫ్ పడిపోయిందనీ, కాంగ్రెస్ కూడా పుంజుకునే పరిస్థితి లేదన్నారు.
ఎన్నికలను తెలంగాణ రాష్ట్ర సమితి ఎదుర్కొనే విధానమే ఈ సందర్భంగా చర్చించాల్సిన అంశం! ఏదో ఒక బలమైన వ్యతిరేకతపై పోరాటం చేయాలనే పంథాలోనే ఎన్నికలన్ని ఫేస్ చేస్తున్నారు. గడచిన అసెంబ్లీ ఎన్నికలే తీసుకుంటే… తెలంగాణ ఢిల్లీకి గులాం కావాలా, ఆంధ్రా నాయకత్వం తెలంగాణకు అవసరమా అంటూ ప్రచారం చేసి సెంటిమెంట్ తో లబ్ధి పొందారు. ఇప్పుడు కూడా… ఢిల్లీ మెడలు వంచాలి, జుత్తు పట్టుకోవాలి, పదహారు మంది ఎంపీలను ఇస్తే ఢిల్లీపై కేసీఆర్ పెత్తనం చేస్తారు… ఒక రకమైన ఎమోషనల్ పంథాలోనే ఇప్పుడు కూడా ప్రచారం సాగిస్తున్నారు కేటీఆర్. ఇద్దరు ఎంపీలతో ఉద్యమం సాగించడానికీ, పదహారు మందితో కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించడానికి ఉన్న పోలిక ఏంటి..? రాజకీయం వేరు, ఉద్యమం వేరు. ఇంకా ఉద్యమ పంథాలోనే రాజకీయం చేస్తోంది తెరాస. ఎన్నికలంటే భావోద్వేగాలకు సంబంధించిన అంశంగా ప్రొజెక్టు చేస్తున్నారు. ఇక, త్వరలో సీఎం కేసీఆర్ కూడా ప్రచారానికి దిగుతున్నారు. ఆయన ప్రచార సరళి మరింత తీవ్రంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.