విపక్షాలు ఎంత అరచి గగ్గోలు పెట్టినా సరే కొత్త సెక్రటేరియట్ కట్టి తీరుతామని తెలంగాణ సిఎం కెసియార్ స్పష్టం చేశారు. దీనిపై ఏ మాత్రం వెనక్కు తగ్గబోమని చెప్పారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ… ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న మన సచివాలయం దేశంలోనే ఎక్కడా లేనంత చెత్త సచివాలయం అంటూ తీసిపారేశారు..
కేవలం వాస్తు కోసం సచివాలయం మార్చడం లేదని చెప్పారు సిఎం. ఇప్పటిదాకా ఎడా పెడా ఖాళీ స్థలం దొరికితే నిర్మాణాలు చేసేసి, కేవలం సెక్రటేరియట్ ఒక్కటి కడితేనే హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్‌గా మారిపోతుందంటున్నారంటూన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న సచివాలయంలోని ఏ భవనానికీ పక్కా ప్లానింగ్ గాని, సరైన అనుమతులుగాని లేవన్నారు. అగ్నిప్రమాదాలు జరగకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు, తగిన ముందస్తు ఏర్పాట్లు లేవన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కూర్చునే సి-బ్లాక్ సైతం ఓ తీరుగా లేదని సరైన వసతులు లేవన్నారు.
దేశంలోనే హైదరాబాద్ నగరం తొలి 5 మెట్రోల్లో అగ్రగామిగా ఉందన్నారు. అలాంటి నగరం మనకు ఉండడం మన భాగ్యం అంటూ, ఆ నగరంలో ప్రభుత్వాన్ని ప్రతిబింబించే సచివాలయం ఉండాల్సిన తీరు ఇది కాదన్నారు. బెంగుళూరులో ఉన్న విధాన్ సౌధ ఒక ల్యాండ్ మార్క్ అని పర్యాటకులు ఆసక్తిగా దాన్ని చూస్తారని, అక్కడ తాను కూడా నుంచుని ఫొటో దిగానని గుర్తు చేసుకున్నారు. సచివాలయ నిర్మాణం కోసం ఏదో వేల కోట్లు వృధా చే్స్తున్నట్టు మాట్లాడుతున్నారని అయితే తక్కువలో కడితే రూ.180కోట్లు కాస్త ఎక్కువ అనుకుంటే రూ.240కోట్లు మించి ఖర్చు కాదని, ఆ మాత్రం ఖర్చు పెట్టుకోలేని దుస్థితిలో తమ తెలంగాణ రాష్ట్రం ఉందా? అని ప్రశ్నించారు. బైసన్ పోలో గ్రౌండ్ లో కొత్త సచివాలయ నిర్మాణం చేస్తామన్నారు.
అలాగే… నగరంలో ఒక్క రవీంద్రభారతి తప్ప మరో సరైన కల్చరల్ సెంటర్ లేదని విచారం వ్యక్తం చేసిన కెసియార్… ఒక పెద్ద మ్యూజిక్ కన్సర్ట్ జరిగితే సరైన ప్లేస్ లేదన్నారు. ఇలాంటివి అన్నీ సమకూరితేనే అంతర్జాతీయ నగరంగా, చారిత్రక నగరంగా ఉన్న హైదరాబాద్ ఖ్యాతిని మరింత పెంచగలుగుతామన్నారు. అయితే ఈ విషయంపై సిఎం ప్రసంగం అవాస్తవాలతో సాగిందంటూ భాజాపా నేత లక్ష్మణ్ ఆరోపించారు.