ఆ మధ్యన బొత్స సత్యనారాయణ వైకాపాలో చేరుతున్నప్పుడు బొబ్బిలి వైకాపా ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు ఆయన సోదరుడు బేబి నాయిన తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ కారణంగా వారు పార్టీని వీడేందుకు కూడా సిద్దపడ్డారు. అప్పుడు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వారిని బుజ్జగించి పార్టీలో కొనసాగేలా చేయగలిగారు. కానీ వారు ఆ తరువాత కూడా పార్టీ వ్యవహరాలతో అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తూన్నారు.
ఈ నేపధ్యంలో వారితో తెదేపా నేతలు సంప్రదింపులు జరుపుతున్నారని వారు కూడా త్వరలో తెదేపాలో చేరే అవకాశాలున్నాయని మీడియాలో వార్తలు వచ్చేయి. అదే సమయంలో ఐదుగురు వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలో చేరడం, ఇంకా చాలా మంది వైకాపా ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరబోతున్నారని తెదేపా నేతలు చెపుతుండటంతో, బొబ్బిలి రాజుల గురించి మీడియాలో వచ్చిన ఆ వార్తలు కూడా నిజమేఅయ్యుంటాయని అందరూ భావించడం సహజం.
కానీ ఆ వార్తలు, ఊహాగానాలు నిజం కాదని వైకాపా ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు, ఆయన సోదరుడు బేబి నాయిన స్పష్టం చేసారు. తాము పదవులు, అధికారం కోసం వెంపర్లాడేవాళ్ళముకామని బేబీ నాయిన అన్నారు. తాము ఎప్పుడూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేవాళ్ళమని తెలిపారు. నీతికే కట్టుబడి మచ్చలేని రాజకీయాలు చేస్తామని తెలిపారు. తాము వైకాపాలోనే కొనసాగుతామని స్పష్టం చేసారు.
సుజయ్ కృష్ణ రంగారావు కూడా ఈ వార్తలను ఖండించారు. మీడియాకు చెందిన వాళ్ళు తమ వివరణ తీసుకోకుండానే తాము పార్టీ మారబోతున్నట్లు ప్రచారం చేయడం తగదని అన్నారు. తాము పార్టీ మారబోవడం లేదని సప్శాతం చేసిన తరువాత కూడా ఇంకా మీడియాలో తమ గురించి అలాగే వ్రాస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు. మీడియాలో వస్తున్న ఇటువంటి వార్తల వలన తమ కార్యకర్తలలో గందరగోళం ఏర్పడుతోందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులకు ఎంత బాధ్యత ఉంటుందో మీడియాకు కూడా అంతే బాధ్యత ఉంటుందని ఆయన అన్నారు. తాము ప్రలోభాలకు, బెదిరింపులకి లొంగిబోమని, తెదేపాలో చేరే ఉద్దేశ్యం తమకి లేదని స్పష్టంగా చెప్పారు. ఒకవేళ ఎవరయినా పార్టీ మారదలిస్తే ముందుగా ఆ పార్టీ తరపున గెలిచినా ఎమ్మెల్యే పదవులను వదులుకొని వెళ్ళడం మంచి సంప్రదాయమని అన్నారు.
ప్రస్తుతం తెదేపా ‘ఆపరేషన్ ఆకర్ష’ కారణంగా ఇంకా ఎంత మంది ఎమ్మెల్యేలను కోల్పోవలసి ఉంటుందో తెలియని ఈ పరిస్థితులలో బొబ్బిలి రాజులు చేసిన ఈ ప్రకటన వైకాపాకు తప్పకుండా చాలా ఉపశమనం కలిగిస్తుందని చెప్పవచ్చును.