తెలంగాణలో రాజ్యసభ అభ్యర్థుల ప్రకటనపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. నిన్నే అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తారని అనుకున్నా, సాయంత్రం వరకూ ఎలాంటి ప్రకటనా విడుదల కాలేదు. నామినేషన్లకు చివరి తేదీ 13 కావడంతో, ఇవాళ్ల అభ్యర్థుల అధికారిక ప్రకటన ఉంటుంది. మరోసారి కేశవరావుకి లైన్ క్లియర్ అయిపోయిందని కథనాలు వచ్చాయి. నామినేషన్ వేయడానికి ఆయన ఓ పక్క సిద్ధమౌతున్నారని అంటున్నారు. ఇక, ఉత్కంఠ అంతా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చుట్టూనే తిరుగుతోంది. ఎలాగైనా ఈసారి రాజ్యసభ సీటు దక్కించుకోవాలన్న గట్టి ప్రయత్నంలో ఆయన ఉన్నారు. నోటిఫికేషన్ వచ్చిన దగ్గర్నుంచీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కి తరచూ టచ్ లో ఉంటూనే ఉన్నారు.
బుధవారం నాడు అసెంబ్లీ ప్రాంగణంలో పొంగులేటి కనిపించారు. అసెంబ్లీలో ఉన్న కేటీఆర్ ఛాంబర్లో ఆయన చాలాసేపు కూర్చున్నారు. అంతేకాదు, తనకు మద్దతుగా నిలుస్తున్న ఎమ్మెల్యేలను కూడా కేటీఆర్ ముందుకు తీసుకెళ్లారు. అసెంబ్లీ టీ బ్రేక్ సమయంలో కొంతమంది ఎమ్మెల్యేలు, ఇతర నేతల్ని మంత్రి దగ్గరకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా నేతలతో కూడా మంత్రి కేటీఆర్ చాలాసేపు మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇలా పొంగులేటికి మద్దతుగా కేటీఆర్ ని కలిసినవారిలో మంత్రి పువ్వాడ అజయ్ కూడా ఉన్నారు. పొంగులేటి ఇంత గట్టిగా ఎందుకు ప్రయత్నిస్తున్నారంటే, ఇదే స్థాయిలో ఆయనకి రాజ్యసభ సీటు దక్కకుండా మరో వర్గం కూడా గట్టిగానే ప్రయత్నిస్తూ ఉండటం అని తెలుస్తోంది.
ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు ప్రముఖ నేతలు పొంగులేటి అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ ఆయనకి సీటు దక్కితే, జిల్లాలో తమ సామాజిక వర్గ నేతలకు ప్రాధాన్యత తగ్గిపోతుందని భావిస్తున్నారని తెలుస్తోంది. అందుకే వారంతా హెటిరో ఫార్మా అధినేత పార్థసారధి రెడ్డికి అవకాశం ఇవ్వాలంటూ పార్టీని కోరుతున్నట్టు సమాచారం. ఏదేమైనా, ఎవరికి సీటు దక్కుతుందో అనేది ఇవాళ్ల తేలిపోతుంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో కేసీఆర్ నిర్ణయం అనూహ్యంగా ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.