గురువారం కురిసిన కుండపోత వర్షానికి హైదరాబాద్ ఇంకా తేరుకోనేలేదు.. అప్పుడే మరో బిగ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. శుక్రవారం సాయంత్రం నగరంలో భారీ వర్షం కురుస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈరోజు ఉదయం నుంచి కూడా నగరమంతా నల్లని మబ్బులతోనే కమ్మేసే ఉంది. మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించగా తాజాగా మరికొద్ది గంటల్లో హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం కురుస్తుందని అలర్ట్ ఇచ్చింది. చాలా రోజులుగా తీవ్రమైన ఎండతో అల్లాడిపోతున్న ప్రజలకు తాజాగా కురిసిన వర్షం ఊరట ఇచ్చినా నగరవాసులను తీవ్ర అవస్థలకు గురి చేసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతోపాటు, ఇళ్ళలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
గురువారం నగరంలో కురిసిన వర్షం చూసి ఆకాశానికి ఏమైనా చిల్లు పడిందా..? అనే తరహాలో గంట పాటు ఏకధాటిగా వాన విజృంభించింది. కుండపోత వర్షాలతో పలు ప్రాంతాల్లో ఎక్కడిక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ రద్దీతో ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే మరోసారి వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరికలతో నగరవాసులు అలర్ట్ అవుతున్నారు.