కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తాజా సమాచారం. ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తమ స్వస్థలమైన అలహాబాద్ నగరానికి చెందిన ఒక బ్రాహ్మణ యువతిని వివాహం చేసుకొబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన తల్లి సోనియా గాంధీ కొన్ని రోజుల క్రితం అలహాబాద్ వెళ్ళినప్పుడు నెహ్రూ కుటుంబానికి చెందిన ఆనంద్ భవన్ లో ఈ పెళ్లి మాటలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఈ వార్తలని దృవీకరించడంలేదు. అలాగని ఖండించడం లేదు కూడా.
రాహుల్ గాంధీకి ఇప్పుడు 46 ఏళ్ళు నిండాయి. జీవితంలో దాదాపు సగం వయసు పూర్తయినా ఏవో కారణాలతో రాహుల్ గాంధీ తన వివాహాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. ఇంతవరకు చాలా మంది నుంచి పెళ్లి ప్రతిపాదనలు కూడా వచ్చాయి. కానీ అయన సముఖత వ్యక్తం చేయకపోవడంతో సోనియా గాంధీ కూడా ప్రయత్నాలు చేయలేదు. ఇప్పుడు పెళ్లి చేసుకొనేందుకు రాహుల్ గాంధీ సుముఖత వ్యక్తం చేయడంతో సోనియా గాంధీ ఈ సంబంధం ఖాయం చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి కనుక ఈలోగానే రాహుల్ గాంధీ పెళ్లి చేయాలని సోనియా గాంధీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి కలిసిరావచ్చునని అంచనా వేస్తున్నట్లున్నారు. రాహుల్ గాంధీ వివాహం గురించి కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రకటన చేయవలసి ఉంది.