గాలి జనార్దన్ రెడ్డి తన కుమారుడి పెళ్లి వేడుకను ఎలా నిర్వహించారో అందరూ చూశారు. ఆయన అతిధుల్ని ఆహ్వానించడానికే… ఒక్కో పెళ్లి పత్రికకు లక్షల్లో ఖర్చు చేశారు. కోట్లు ఇచ్చి సెలబ్రిటీల్ని పిలిపించారు. ఓ భారీ సినిమాకు వేసే సెట్టింగులన్నీ వేశారు. అతిధులకు.. మర్చిపోలేని ఆతిధ్యం ఇచ్చారు. ఇవన్నీ నోట్ల రద్దు తర్వాత జరిగిన వ్యవహారమే. పెద్ద ఎత్తున వివాదాస్పదం అయిందే. దాదాపుగా రూ. ఐదు వందల కోట్ల వరకూ ఆయన కుమారుడి పెళ్లికి ఖర్చు పెట్టారని చెప్పుకుంటారు. ఇప్పుడు ఆయన అనుంగు అనుచరుడు… కర్ణాటక మంత్రి శ్రీరాములు కూడా.. ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
హైదరాబాద్‌లోని ఓ రెడ్డి పారిశ్రామికవేత్తల కుటుంబానికి ఇచ్చి కుమార్తెకు కులాంతర వివాహం చేస్తున్న శ్రీరాములు.. బెంగుళూరులో పెళ్లి.. అట్టహాసంగా చేస్తున్నారు. అట్టహాసం అనే పదం చాలా చిన్నదే. గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడి పెళ్లి వైభోగాన్ని మించి మరీ చేస్తున్నారు. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు మీడియాలో హైలెట్ అవుతున్నాయి. బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో పెళ్లి.. కోట్లు ఖర్చు పెట్టి సెట్టింగులు రెడీ చేస్తున్నారు. మంగళవారం నుంచే..మొహందీ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. దీనికి హిందీ, కన్నడ రంగాలకు చెందిన స్టార్లతో డీల్స్ చేసుకున్నారు. వారందరూ వచ్చి మొహందీలో డాన్స్ చేయబోతున్నారు. పెద్ద ఎత్తున వచ్చే వీఐపీల కోసం.. బెంగళూరులోని స్టార్ హోటల్స్ లో మెజార్టీ గదులను బుక్ చేసినట్లుగా తెలుస్తోంది.
శ్రీరాములు , గాలి జనార్ధన్ రెడ్డి ఇద్దరూ కలిసి ఓబులాపురం మైనింగ్ వ్యాపారం చేశారు. గాలి వ్యాపారాల్లో ఆయనకూ వాటా ఉంది. గాలి జనార్ధన్ రెడ్డి రాజకీయంగా ఇబ్బందులు పడుతూండంటో.. బళ్లారి ప్రాంతంలో మొత్తం శ్రీరాములే వ్యవహారం చక్క బెడుతున్నారు. ఇప్పుడు.. మంత్రిగా కూడా ఉండటంతో.. ఆయన హంగామాకు తిరుగులేకుండా పోయింది.