తెలంగాణలో మరోసారి కేసీఆరే గెలవబోతున్నారని ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే కొత్త పలుకులో తేల్చేశారు గతంలో ఎప్పుడూ ఇంత పాజిటి వ్ గా రాయలేదు. కేసీఆర్ పై తీవ్ర వ్యతిరేకత ఉందని…. ఆయన సీఎం కాలేరన్నట్లుగా రాసేవారు. కానీ ఇప్పుడు మాత్రం స్వరం మారింది. దీనికి కారణం కూడా ఆయన చెబుతున్నారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలు.. బలపడుతున్నాయి కానీ… కేసీఆర్ ను ఓడించేంత కాదు. మూడు పార్టీల పోరులో ఓట్లు చీలిపోయి కేసీఆర్ విజయం సాదించబోతున్నారని ఆర్కే చెబుతున్నారు.
తన ఆర్టికల్లో బీజేపీ ఎందుకు ఎదగలేకపోతోందో చెప్పుకొచ్చారు. ఓ రకంగా ఆయన తన ఆర్టికల్ ద్వారా బీజేపీకి సలహాలిచ్చారని అనుకోవచ్చు. కానీ ఆర్కే ఆర్టికల్ బీజేపీ హైకమాండ్ వరకూ వెళ్లదు. ఈ ఆర్టికల్లో తెలంగాణ బీజేపీ నేతలకు ఎలాంటి అధికారాలు లేవని తేల్చి చెప్పారు. ఎంత పెద్ద నేత అయిన తమకు టిక్కెట్ ఖరారు చేసుకోలేరని.. . మరొకరికి ఇప్పించలేరని తేల్చారు అంటే ఎలాంటి నిర్ణయాదికారం లేదన్న మాట. అలాంటప్పుడు.. ఎన్ని సలహాలు తన ఆర్టికల్ ద్వారా ఇచ్చినా వారు చేయగలిగిందేమీ లేదు.
అదే సమయంలో రేవంత్ రెడ్డిపై ఆయన కాస్త పాజిటివ్ గా స్పందించారు. కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా రేవంత్ రెడ్డిని ప్రజలు చూస్తున్నారని ఆయన పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని చెప్పారు. నిజానికి రేవంత్ పాదయాత్ర సాగుతున్న విధం మీడియా ఫోకస్ ఇస్తే.. కాంగ్రెస్ పార్టీ కి ఫేవర్ గా రాజకీయం మారి ఉండేది. కానీ పది మంది కూడా ఉండని మహేశ్వర్ రెడ్డి పాదయాత్రకు మీడియా ఇస్తున్న కవరేజీ అంత కూడా రేవంత్ పాదయాత్రకు ఇవ్వడం లేదు. అందుకే కాంగ్రెస్ బలంగానే ఉంది కానీ గెలిచేంత కాదని చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఆర్కే కూడా అదే చేశారు.
ఆర్కే ఈ సారి ఏపీ రాజకీయాల గురించి ప్రస్తావించలేదు. తెలంగామ బీజేపీ నేతల ఢిల్లీ పర్యటన గురించే అన్నీ విశ్లేషించుకున్నారు. కేసీఆర్ కు భరోసా కల్పించే మాటలు చెప్పారు.