హమ్మయ్య… మొత్తానికి థియేటర్లు తెరచుకుంటున్నాయి. కొత్త సినిమాల హంగామా కనిపించబోతోంది. ఈవారం రెండు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. సత్యదేవ్ `తిమ్మరుసు`తో పాటుగా… తేజ `ఇష్క్` ఈవారమే వస్తున్నాయి. రెండూ చిన్న సినిమాలే. కాకపోతే.. కంటెంట్ బలంగా ఉన్న కథలు. రెండు సినిమాల ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి సిద్ధంగా ఉన్నారా, లేదా? థియేటర్ల దగ్గర ఎలాంటి వాతావరణం కనిపించబోతోంది? అనేది తెలుసుకోవడానికి ఇవి రెండూ పైలెట్ ప్రాజెక్టులుగా ఉపయోగపడబోతున్నాయి. ఈ రెండు సినిమాల రిజల్ట్ ని బట్టి.. ఆగస్టులో సినిమాలు విడుదల చేయాలా? ఇంకొన్ని రోజులు ఆగాలా? అనే విషయంపై నిర్మాతలు ఓ నిర్ణయానికి వస్తారు.
* ఏపీలో అదే సమస్య
తెలంగాణలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఉంది. దాంతో పాటు పార్కింగ్ ఛార్జీలు వసూలు చేసుకునే అవకాశాన్ని థియేటర్లకు కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఏపీలో మాత్రం పరిస్థితి విరుద్ధంగా ఉంది. అక్కడ 50 శాతం ఆక్యుపెన్సీకే అవకాశం. దాంతో పాటు నైట్ షోలు లేవు. టికెట్ రేట్లపై ఇంకా ప్రభుత్వం దిగి రాలేదు. దాంతో.. ఏ,బీ సెంటర్లలో థియేటర్లు తెరచుకునే అవకాశం లేదు. కేవలం మల్టీప్లెక్స్లలోనే బొమ్మ పడబోతోంది. విశాఖ, విజయవాడ, కాకినాడ లాంటి సిటీల్లోనే థియేటర్లు తెరచుకోబోతున్నాయి. సీ సెంటర్లలో థియేటర్లు తెరచుకోవడం లేదు. బీ సెంటర్లు కూడా డౌటుగానే ఉన్నాయి. మొత్తానికి ఏపీలో 25 శాతం మాత్రమే థియేటర్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అసలే 50 శాతం ఆక్యుపెన్సీ.. అందులోనూ మూడొంతుల థియేటర్లకు తాళాలు పడ్డాయి. ఇలాంటప్పుడు సినిమా విడుదల చేసుకోవడం రిస్కే.