నన్నునేను ఇలా పరిచయం చేసుకోవాల్సివస్తుందని కలలోకూడా అనుకోలేదు. అందలం ఎక్కిన నేను ఇలా శోకమూర్తిగా మారిపోయాను. గతంలో కూడా ఎన్నోసార్లు కష్టాలు, కన్నీళ్లు వచ్చాయి. కానీ నా గుండెచప్పుడు మీకు వినిపించలేదు. కానీ ఈసారి నా మనసు ఊరుకోవడంలేదు. మహానగరం మహాసముద్రంగా మారిపోయి బోరున విలపిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. వందసంవత్సరాల్లో ఇలాంటి కష్టం రాలేదని నా బిడ్డలు (నగర వాసులు) అంటున్నారు. ఏమో..ఈ కాలప్రవాహంలో ఎన్నని గుర్తుపెట్టుకోను. నా వయసు నాకే గుర్తుకురావడంలేదు. బాలసారెప్పుడు పెట్టినపేరు మారిపోయింది. దానికి తగ్గట్టుగానే రూపురేఖలూ మారాయి. ఆధునీకరణతో సెజ్జులు, పిజ్జా హట్స్ తో సింగారించుకున్నానని మురిసిపోనా, అభివృద్ధి పేరిట నగరం అడ్డదిడ్డంగా పెరిగిపోతున్నందుకు క్రుంగిపోనా…
వరదనీరు నిండా నన్ను ముంచెత్తింది. నిద్రపోని నగరమని అంతా అంటుంటే వెలిగిపోయాను. రోజుకి 24 గంటలు నాకు సరిపోవడంలేదు. ఎప్పుడూ ఊపిరిసలపని పనులుతో ఉంటాను. అలాంటినాపై జలఖడ్గం విరుచుకుపడింది. ఆమధ్య సునామీ కాటువేసినప్పుడు నేను చాలా భయపడ్డాను. అలాంటి వైపరీత్యాన్ని సైతం పిల్లలు ధైర్యంగా ఎదుర్కున్నారు. కానీ ఈసారి డీలాపడిపోయారు. ఇప్పుడొచ్చిన వరద నిజంగా ప్రకృతి వైపరీత్యమేనా? అన్న సందేహం నాకు కూడా కలుగుతోంది. జోరువానలు పడినమాట నిజమే. కానీ దానికంటే ప్రమాదకరంగా రిజర్వాయర్ల నుంచి అదనపు నీరును వదిలేశారు. దీంతో నగరంలో వరదపోటెత్తింది. రిజర్వాయర్లలో నీరు వదిలేస్తున్నామంటూ చెప్పేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. మధ్యాహ్నం నుంచి పేటలు మునిగిపోవడం మొదలైంది. రాత్రికల్లా కొన్ని చోట్ల ఇళ్లు మునిగిపోయాయి. ఆఫీసులకు వెళ్ళినవాళ్లు వరదనీటిలో చిక్కుకుపోయారు. కార్లు తేలియాడే పరిస్థితి. రోడ్లు ఎక్కడ ఉన్నాయో, డ్రైనేజ్ ఎక్కడో తెలియకుండా ఉంది. విద్యుత్ సరఫరా ఆగిపోయింది. నా పిల్లలు ఆరోజు కాళరాత్రిని అనుభవించారు. గంటగంటకూ నీటిమట్టం పెరుగుతుండటంతో జనం బేజారైపోయారు.
అత్యవసర ఆరోగ్య సేవలకోసం వెళ్ళాల్సినవారి పరిస్థితి దారుణంగా మారింది. అంబులెన్స్ లు పేషెంట్స్ ని ఆదుకునే పరిస్థితి కనిపించలేదు. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నవారు ఇళ్లకెళ్లి తమ చిన్నారులను కలుసుకునే అవకాశాల్లేక విలవిల్లాడారు. కుటుంబసభ్యులను ప్రళయరాత్రి విడగొట్టింది. చుట్టూ నీరున్నా త్రాగడానికి నీరులేదు. పసిపాపలకు గుక్కెడు పాలు దొరకలేదు. దీనికి తోడు మధ్యదళారులు స్వైరవిహారం చేశారు. నిత్యావసర వస్తువులకు రెక్కలొచ్చాయి. ప్యాకెట్ పాలు 150 రూపాయలు పోసి కొనుక్కోవాల్సి వచ్చింది. వికలాంగులు వరదల నుంచి తప్పించుకునేదారిలేక వణికిపోయారు. వృద్ధుల సంగతిసరేసరి. కొన్నిచోట్ల రెండుమూడు డ్రమ్ములను కలిపి వాటినే బోట్లుగా మార్చి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. క్యాబ్స్ నడిపే కంపెనీలు బోట్లు నడపి తమవంతు సహకారం అందించాయి.
ఛార్జింగ్ లేక, సింగ్నల్స్ అందక మొబైల్ ఫోన్ వ్యవస్థ చతికిలబడింది. సమాచారవ్యవస్థ లేకపోవడంతో బంధుమిత్రులు ఆందోళనకు గురయ్యారు. రైళ్లులేవు, బస్సులు కదలవు, విమానాలు ఎగరవు. ఎటూ వెళ్ళే దారేలేదు. ఆ రోజు (1-12-15) తెల్లవారినతర్వాత కొన్ని వార్తా పత్రికలు రాలేదు. 137ఏళ్ల తర్వాత హిందూ పత్రిక ప్రింట్ కాలేదు. జయ టివీ స్టేషన్లోకి వరదనీరు రావడంతో ప్రసారాలు ఆగిపోయాయి. పునరుద్ధరించడానికి రెండురోజులు పట్టింది. విమానాశ్రయం జలాశయంగా మారిపోయింది. ఎక్కడి విమానాలు అక్కడే బొమ్మల్లా నిలిచిపోయాయి.
ఇంత జరుగుతున్నా నాలో మనోధైర్యం సన్నగిల్లలేదు. నాకు తెలుసు, నా బిడ్డలు (చెన్నై వాసులు) ఈ కడగళ్లను, కన్నీళ్లను ధైర్యంగా ఎదుర్కోగలరని. అనుకున్నట్టుగానే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. పునరావసకేంద్రాలు ఏర్పడుతున్నాయి. సత్యం వంటి సినిమా థియేటర్లు, కాలేజీలు, కంపెనీలు ఇలా ఎన్నో పునరావసకేంద్రాలుగా మారిపోయాయి. కొన్ని హోటళ్లు ఆహారపదార్థాలను ఉచితంగా అందజేశాయి. సినీనటుడు సిద్ధార్ధ వంటి ప్రముఖులు సోషల్ మీడియాని అందిపుచ్చుకుని చేతనైన సాయం చేస్తున్నారు. బాధితులకు దుప్పట్లు, ఆహారం, అత్యవసర మందులు…ఇలా ఎన్నో సమకూరుస్తున్నారు. సినీనటులు మహేష్ బాబు, ఎన్టీఆర్, రజనీకాంత్, ప్రభాష్, కృష్ణంరాజు, అల్లు అర్జున్ వంటి నటులు బాధితులకు సాయం అందించారు. ఇంకా అందిస్తూనే ఉన్నారు.
వరదనీరు ఇంకిపోకుండా ఉండిపోవడానికి కారణం ఎవరన్నది అంతా ఆలోచించాల్సిన సమయం ఇది. ఎంతో ఘన చరిత్ర ఉన్న నాకు ఈ దుస్థితి తెచ్చింది ఎవరు? చెన్నై నగరమంటే ఎంతో సుందరమైనది. నదీనదాలు, పిల్ల కాలువలు, చెరువులు, కుంటలు…సహజ డ్రైనేజ్ వ్యవస్థతో వరదలను తట్టుకునే నగరంగా ఉండేదని అంతా అనుకునేవారు. కానీ కాలం మారింది. ప్రభుత్వాలు మారుతున్నా, రాజకీయా పోకడలు మారలేదు. అధికారుల్లో నిజాయితీ తగ్గిపోయింది. స్వార్థచింతన పెరిగిపోయింది. ఫలితంగా నగరం అడ్డదిడ్డంగా పెరిగింది. జల నియంత్రణ వ్యవస్థ అడుగంటింది. నగరం పెరిగినందుకు సంతోషించాలా, లేక అడ్డదిడ్డంగా ఎదిగినందుకు విచారించాలో తెలియని పరిస్థితి. వందలాది సంవత్సరాల్లో ఎప్పుడూ చూడని దుస్థితి ఇది. ప్రకృతి వైపరీత్యాలకు చూసి నేను ఏనాడు క్రుంగిపోలేదు. కానీ మానవ తప్పిదాలకు మాత్రం కంగారుపడిపోతున్నాను. ప్లీజ్, నన్ను కాపాడండి…
– కణ్వస