పోలింగ్ కు రెండు రోజుల ముందు లబ్దిదారుల ఖాతాల్లో రూ. 14వేల కోట్లు వేసేస్తామని హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆ డబ్బులు జమ చేయడం లేదు. ఇదిగో అదిగో అంటూ నసుగుతోంది. పలు వర్గాల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో కొంత మేర ఫీజు రీఎంబర్స్ మెంట్… కొంత మంది ఆసరా పథకం డబ్బులు జమ చేశారు. ఈ మొత్తం రూ. 1400 కోట్లు ఉంటుందని అంచనా. అంటే పది శాతం మాత్రమే. మిగతా 90 శాతం డబ్బులు ఎక్కడికిపోయాయి ?
మొత్తం ఒకే సారి లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయడానికి నగదు ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు లేవు అన్నది ప్రధాన ప్రశ్న., పోలింగ్ ముగిసి నాలుగు రోజులు అయిపోయింది. లబ్దిదారుల ఖాతాల్లో నగదు లేదు కానీ కాంట్రాక్టర్లకు మాతరం పదిహేను వందల కోట్లు చెల్లించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇలా చెల్లించి ఉంటే ప్రజల్ని అడ్డగోలుగా మోసం చేసినట్లే. ఈ విషయంపై విపక్షాలు గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేశాయి.
నిధులు లేకపోవడం అనే సమస్యే లేదు. ఎందుకంటే మొత్తం ఖాతాల్లో వేయడానికి నగదు రెడీ చేసుకున్నారు. ఈ మంగళవారం ఏకంగా నాలుగు వేలకోట్లు రుణం తీసుకున్నారు. మూడు వేల కోట్లు పన్నుల్లో వాటాల కింద వచ్చాయి. ఆ మొత్తం ఎక్కడికి పోయిందో చెప్పాల్సి ఉంది. మొత్తంగా ఎప్పుడో ఆరు నెలల కిందట బటన్ నొక్కిన పథకాలకు డబ్బులు మాత్రం రిలీజ్ చేయడం లేదని తేలిపోయింది.