వైసీపీకి ఓటు వేయని వారికీ పథకాలు వర్తింప చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. రెండో విడత వాహన మిత్ర పథకం అమలులో భాగంగా… సొంత ఆటోలు, కార్లు ఉన్న డ్రైవర్లకు రూ.పది వేల సాయాన్ని స్వహస్తాలతో బదిలీ చేశారు. పాదయాత్రలో.. ఫిట్ నెస్ సర్టిఫికెట్ల కోసం.. పెద్ద ఎత్తున ఖర్చు చేయడం చూశానని..వారి కష్టాలను తీర్చడానికి.. రూ.పది వేలు సాయం చేస్తానని ప్రకటించానన్నారు. మొత్తంగా రెండున్నర లక్షల మందికే సాయం అందుతోంది. అంటే.. నియోజకవర్గానికి పదకొండు.. పన్నెండు వందల మందికే లబ్ది కలుగుతుంది.
డ్రైవర్లు అందరికీ కాకుండా.. కేవలం సొంత వాహనాలు ఉండి.. సొంతంగా నడుపుకుంటున్న వారికి మాత్రమే సాయం చేస్తున్నారు. నాలుగు నెలల తర్వాత ఇవ్వాల్సి ఉన్నా… కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్నారని ఇప్పుడే ఇస్తున్నామని జగన్ ప్రకటించారు. ఎక్కడైనా ఎవరికైనా అర్హత ఉండి రాకపోతే ఆందోళన చెందవద్దని… నాకు ఓటు వేయకపోయినా సరే, అర్హులైతే చాలు పథకం వర్తింప చేస్తామని హామీ ఇచ్చారు. అర్హత ఉన్న వారు వార్డు, గ్రామ సచివాలయానికి వెళ్లి, పథకం అర్హతల గురించి తెలుసుకోవాలని.. అర్హులైతే దరఖాస్తు చేసుకోవాలని.. అలాంటి వారందరికీ వచ్చే నెల 4న సహాయం చేస్తామన్నారు.. లేకపోతే స్పందన వెబ్సైట్లో రిజస్టర్ చేసుకున్నా… ఎంక్వైరీ చేసి.. పథకం వర్తింప చేస్తారన్నారు.
రూ. పదివేలను.. ఇన్సూరెన్సు, ఎఫ్సీ కోసం ఖర్చు చేయమని సీఎం సలహా ఇచ్చారు. ఈనెల 10న నాయిబ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు సాయం పంపిణీచేస్తామని స్పష్టం చేశారు. 17న నేతన్న హస్తం, 24న కాపు నేస్తం పథకాలు..అలాగే ఈనెల 29న ఎంఎస్ఎంఈలకు రెండో విడత లబ్ది పంపిణీ చేస్తామన్నారు. పతకాలకు నిధులు చెప్పిన సమయానికి విడుదల చేస్తున్నా.. లబ్దిదారుల సంఖ్యను చాలా చాలా పరిమితం చేయడం మాత్రం.. అసంతృప్తికి కారణం అవుతోంది. సొంత వాహనం ఉండాలన్న రూల్ కాకుండా.. డ్రైవర్లందరికీ సాయం చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.