అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడటానికి బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. బీసీ సంక్రాంతి సభలో ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. అంటే.. ప్రజలకు అందించే అమ్మఒడి సహా వివిధ పథకాల నిధులను ఏ ఏ వర్గానికి అందించారో వివరాలు తెలుసుకుని.. ఏ వర్గం వారైతే.. ఆ వర్గం కార్పొరేషన్ ద్వారా ఇచ్చినట్లుగా లెక్కలు చూపిస్తారు. ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. కార్పొరేషన్లు అంటే ఇప్పటి వరకూ ఆయా వర్గాల్లోని పేదలు, యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రుణాలు.. ఇతర తరహా సహాయం చేసే సంస్థ. ఇప్పుడు కార్పొరేషన్ల అర్థం మార్చేశారు. కేవలం సంక్షేమ పథకాలు అందరికీ అందడానికి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. వాటికి ప్రత్యేకంగా నిధులేమీ కేటాయించబోవడం లేదని ముఖ్యమంత్రి జగన్ బీసీ సంక్రాంతి సభ ద్వారా క్లారిటీ ఇచ్చినట్లయింది.
బీసీలకు నెల రోజుల ముందే సంక్రాంతి వచ్చినట్లుగా ఉందని విజయవాడలోని ఇందరాగాంధీ స్టేడియంలో బీసీ సంక్రాంతి సభలో ముఖ్యమంత్రి జగన్ సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల ప్రభుత్వం నియమించిన 56 కార్పొరేషన్ల చైర్మన్లు, డైరక్టర్లతో ప్రమణస్వీకారం చేయించారు. బలహీనవర్గాలను బలపర్చడంలో మరో అడుగు వేశామని జగన్ సంతృప్తి వ్యక్తం చేశారు. 56 కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను నియమించామని .. వెనుకబడిన వర్గాలకు ఇన్ని పదవులు ఇవ్వడం ఎక్కడైనా చూశారా అని ప్రశ్నించారు. అన్ని పదవుల్లో మహిళలకు పెద్దపీట వేశామన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీల కోసం యాభైవేల కోట్లు ఖర్చు చేస్తామని పదిహేను వేలకోట్లు మాత్రమే ఖర్చు చేసిందని ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. గత ప్రభుత్వం కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిందన్నారు.
బీసీ సంక్రాంతి సభను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. గతంలో చెప్పినట్లుగా 120కిపైగా ఉన్న బీసీ కులాలకు అన్ని కార్పొరేషన్లు కాకపోయినా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినందున పెద్ద ఎత్తున బీసీలకు మేలు చేస్తున్నామని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునేలా సభను ఏర్పాటు చేశారు. ఇందులో వైసీపీలోని ముఖ్య బీసీ నేతలందరూ పాల్గొన్నారు. అందరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విపరీతంగా పొగడటానికే ప్రాధాన్యం ఇచ్చారు. పెద్ద ఎత్తున ఇతర జిల్లాల నుంచి జన సమీకరణ చేశారు. బీసీ సంఘాల పేరుతో వివివిధ నేతల్ని ఆహ్వానించారు. వారితో ముఖ్యమంత్రికి సన్మానాలు ఏర్పాటు చేశారు. కానీ ఆయా కార్పొరేషన్ల ద్వారా ఆయా కులాల ఆర్థిక అభివృద్దికి ఎలాంటి సాయం చేస్తారో మాత్రం ప్రకటించలేదు.
అదే సమయంలో.. బీసీ సంక్రాంతి సభలో అమరావతిపై కూడా మాట్లాడారు. అమరావతి రాజధానిని ముందే నిర్ణయించుకున్నారని ఆరోపించారు. రాజధాని ఉద్యమంతో ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. ఒక దిగిపోయిన పాలకుడు, చెడిపోయిన బుర్రతో.. సొంత లాభం కోసం ఇన్సైడర్ ట్రేడింగ్ చేశాడని.. భూముల ధరలు పడిపోతాయన్న భయంతో ఉద్యమం చేస్తున్నారని ఆరోపించారు. బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేయించారన్నారు.