లెక్చర్లు దంచికొట్టడం వేరు. చెప్పిన మాటల్ని తు.చ తప్పకుండా ఆచరించి, ఆదర్శంగా నిలవడం వేరు. ఈ విషయంలో ఉపాసన మాటల మనిషి కాదు, చేతల మనిషే అని నిరూపితమైంది. ఉపాసన సేవా మార్గంలో ఉన్న సంగతి తెలిసిందే. ‘మిస్టర్ సి – ఫర్ ఛేంజ్’ పేరుతో ఓ సంస్థని స్థాపించి కొన్ని సేవాకార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఓ వ్యాపారికి మట్టికుండలు బహుమతిగా పంపి `ప్లాస్టిక్ వస్తువుల్ని వాడొద్దు` అనే సందేశాన్ని ఇచ్చింది.
హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్లో ఉపాసన మార్నింగ్ వాక్ చేస్తుంటుంది. ఓ సందర్భంలో కేబీఆర్ పార్క్ సమీపంలో ఉన్న తోపుడు బండి దగ్గర పుదీనా రసం తాగి, ఆ ఫొటో ట్విట్టర్లో పెట్టింది. ఆ ఫొటో చూసి ‘బండి నిండా ప్లాస్టిక్ వస్తువులే ఉన్నాయి’ అంటూ కొంతమంది అభిమానులు కామెంట్ చేశారు. అది గమనించిన ఉపాసన… ఆ తోపుడు బండి నిర్వాహకుడికి కొన్ని మట్టి కుండలు పంపించి – వాటితో పాటు ‘ప్లాస్టిక్ వస్తువుల్ని వాడొద్దు’ అనే సందేశం అందించింది. ఈ రెండు ఫొటోలూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా ప్లాస్టిక్ వాడకం తగ్గించడానికి సెలబ్రెటీలు ఈ రూపంలో ముందుకు రావడం సంతోషించదగిన పరిణామమే.