ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాస్ చంద్రబోసు 1945సం.లో జరిగిన ఒక విమాన ప్రమాదంలో మరణించారనే ఇంతవరకు ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. కానీ ఆయన ఆ ప్రమాదంలో మరణించలేదని, ఆ తరువాత కూడా చాలా కాలం జీవించే ఉన్నారని రుజువు చేసే సాక్ష్యాధారాలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈరోజు బయటపెట్టింది. నేతాజీకి జీవిత విశేషాలను తెలియజేసే 64 ఫైళ్ళు ఇంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉండేవి. వాటిని ఇంత కాలంగా రహస్యంగానే ఉంచారు. కానీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాటిని సంబంధిత నిపుణుల చేత లోతుగా అధ్యయనం చేయించి, వాటిని దేశ ప్రజలకు అందుబాటులో తీసుకురావడం వలన ఎటువంటి నష్టము, సమస్యలు తలెత్తవని నిర్ధారించుకొన్న తరువాత వాటన్నిటినీ ఈరోజు ఏడు సీడిల రూపంలో కోల్ కతాలో విడుదలచేసారు. వాటిని ఇంటర్ నెట్ లో కూడా ఉంచబోతున్నారు. అవన్నీ సోమవారం నుండి ప్రజలందరికీ అందుబాటులోకి వస్తాయి.
ఈ సందర్భంగా మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ నేతాజీ గురించి రెండు ఆసక్తికరమయిన విషయాలు తెలియజేసారు. ఆ ఫైళ్ళలో ఉన్న వివరాల ప్రకారం అందరూ చెప్పుకొంటున్నట్లుగా నేతాజీ 1945సం.లో విమానప్రమాదంలో మరణించలేదు. ఆ తరువాత కూడా ఆయన జీవించే ఉన్నారనే సంగతి ఆ ఫైళ్ళ ద్వారా నాకు అర్ధమయింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత ప్రభుత్వమే ఆయన కుటుంబ సభ్యులపై చాలా కాలం నిఘా పెట్టింది. ఇది అత్యంత దురదృష్టకరం. దేశం కోసం తన సర్వస్వం త్యజించి పోరాడిన నేతాజీ వంటి మహనీయుడికి దక్కవలసిన గౌరవం దక్కలేదు. కనుక ఇప్పటికయినా కేంద్రప్రభుత్వం కూడా తన వద్ద ఉన్న మిగిలిన ఫైళ్ళను అన్నిటినీ తక్షణమే బయటపెట్టాలి,” అని అన్నారు.
భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి రష్యా తప్పకుండా సహకరిస్తుందనే ఉద్దేశ్యంతో 1945సం.లో నేతాజీ సుభాస్ చంద్ర బోస్ జపాన్ నుండి రష్యా చేరుకొన్నారని, కానీ అప్పటి రష్యా ప్రభుత్వం ఆయనని అరెస్ట్ చేసి సైబీరియా జైల్లో పెట్టి చిత్ర హింసలకు గురి చేసి, చివరికి ఉరి తీయడం లేదా విష ప్రయోగం ద్వారా ఆయనను హత్య చేసిందని కొందరు వాదిస్తున్నారు. నేతాజీ రష్యా జైల్లో ఉన్న సంగతి భారత్ మొట్ట మొదటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రుకి కూడా తెలుసని, కానీ ఆయనని స్వదేశానికి రప్పించినట్లయితే తనకు పోటీగా తయారవుతారనే భయంతోనే నేతాజీని విడిపించే ప్రయత్నం చేయలేదనే వాదనలు వినిపించాయి. బహుశః అందుకే నేతాజీ కుటుంబ సభ్యులపై నెహ్రూ ప్రభుత్వం అనేక ఏళ్ళపాటు నిరంతర నిఘా పెట్టి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. నేతాజీ కుటుంబంపై నిఘా పెట్టినట్లు రహస్య పత్రాలలో ఉన్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. కనుక బహుశః నేతాజీని రష్యా జైల్లో మ్రగ్గడం,హత్య చేయబడటం కూడా నిజమేననే అనుమానాలు బలపడుతున్నాయి. అదే నిజమయిన పక్షంలో నేతాజీ మరణానికి నెహ్రుయే బాధ్యుడని భావించక తప్పదు. బహుశః అందుకేనెమో ఇంత కాలం దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఆ రహస్య పత్రాలను బయటపెట్టేందుకు ఇష్టపడలేదు. వాటిని బయట పెడితే ఇతర దేశాలతో సంబంధాలు దెబ్బ తింటాయనే సాకుతో దాచిపెట్టి ఉంచిందేమో? మరొక రెండు రోజుల్లో నేతాజీ జీవితానికి చెందిన ఆ వివరాలన్నీ అందరు తెలుసుకొనే అవకాశం కలుగుతుంది కనుక నేతాజీ చివరి రోజులు ఏవిధంగా ఎక్కడ గడిపారనే సంగతి తెలుస్తుంది.