వ్యవస్థలపై నమ్మకం నిలబెట్టాలంటే అందులో బాధ్యతలు నిర్వహిస్తున్న వారి వల్లే అవుతుంది. వారే కక్కుర్తి పడితే ఇక వినాశనమే మిగులుతుంది. దేశంలో అన్ని వ్యవస్థలపై ఎన్నో సందేహాలు ఉన్నా.. న్యాయవ్యవస్థపై మాత్రం ఎంతో నమ్మకం పెట్టుకుంటారు ప్రజలు.కానీ ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాలు మాత్రం… ప్రజల్లో ఎన్నో సందేహాలు లేవనెత్తుతున్నాయి. తాజాగా బెంగాల్ హైకోర్టు న్యాయమూర్తి అభిజిత్ గగంగోపాధ్యాయ తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి … ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లుగా ప్రకటించారు.
అభిజిత్ చటోపాధ్యాయ తన నిర్ణయం తర్వాత మీడియాతో మాట్లాడారు. బీజేపీ తనను సంప్రదించిందని.. తాను బీజేపీని సంప్రదించానని చెప్పుకొచ్చారు. గంగోపాధ్యాయ ఇచ్చిన తీర్పులు చాలా వరకూ వివాదాస్పదంగా ఉన్నాయి. రెండేళ్లుగా మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా అనేక తీర్పులు ఇచ్చారుు. చిన్న చిన్న కేసుల్ని కూడా ఈడీకి , సీబీఐకి వెళ్లేలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయయనపై మమతా బెనర్జీ పార్టీ లెక్క లేనన్ని ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరుతూండటంతో.. ఆ తీర్పులన్నింటిపై అనుమానాలు ప్రారంభమవుతాయి.
న్యాయమూర్తులు వివాదాస్పద తీర్పులు తరవాత ప్రభుత్వాల నుంచి పదవులు పొందుతున్నారు. అనుకూల తీర్పులు ఇచ్చిన తర్వాత కొంత మంది రాజకీయ నేతలు అధికారంలోకి వచ్చాక రిటైరైపోయిన వారికి పదవులు ఇస్తున్నారు. ఏపీలోనూ అలా కొంత మందికి పదవులు ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఇలాంటివి తరచూ చర్చనీయాంశం అవుతున్నాయి. ఇలాంటివి పెరుగుతూండటంతో.. ప్రజల్లోనూ విస్తృత చర్చ జరుగుతోంది. ఇది మరింత పెరిగితే న్యాయవ్యవస్థ విశ్వసనీయతే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.